మురళి నుండుదయించి చలనమును మరచి,
మౌనమందుండు తానేల మొలచితి నంచు,
మోహనుని విడలేక విరహమూనిన స్వరము,
లారణ్య రూపమును దాల్చగల రాగంబు!
క్షీరాబ్ది కదలికకు శృతినొంది పవనంబు,
నంద బాలుని లీల ఆలపింపగబోవ,
సడిలేని సవ్వడుల లాలిత్య మెరుగు మని,
వేయి పడగలవాడు అందించు విన్నపము!
నటరాజు పదములన అందముగ అమరుండి,
వింత విన్యాసముల వాత్సల్య సవ్వడులు,
కూర్చి చేర్చిన జతులు అమరినా తానమును,
భావమున నాదించి కూర్చినా రాగములు!
వాక్దేవి మృదుకరము సోకి పలికెడు తంత్రి,
భక్తి నాదము జతను జేరి పలికెడు తంత్రి,
కమలా భవుని కంఠ మాలపించిన పదము,
అందించు భావముల సారమౌ రాగములు!
ఆలపింపగ గల్గు ఆయంత్ర మెటనుండు?
ధ్వనులెరుంగని గానమే కంఠమున పలుకు?
పదములమరని నాద ముదయించు తావేది?
ఎరుక గరిపెడి వాని నెందు కనుగొందు?
సాధనల సారాంశ మీ రవళి యన్నారు
సాధుజన రక్షకుడు అందమరె నన్నారు,
తనువులో నడయాడు నాదమదె యన్నారు,
నా పలుకులో కులికి రమియించు నన్నారు!
చెలిమి చేయగరాని చెలికాని విలువేమి?
కాలగతి గతియించు ఈ తనువు విలువేమి?
వెలుగు నీడల ఆట వేగమే చాలించి
ఉనికి నెరిగించుమో క్షీరాబ్ధి వాసా!