పాలు నీవని కుడియ నెంచిన – పంచ ధారల బొమ్మ నేనయ!
పంతమాడక నీదు బలమును అందజేయుము నెమ్మన !!
కమ్మనైనీ పాల కుండను అంది పంచెడివారు -విబుధులు ,
అందుమంచూ కొసరి కూరిమినందజేతురు విరివిగా ,
ఆదరంబున దరిని జేర్చుక జుర్రుకొనుడని పంచుచూ,
విందుగందిన గుమ్మపాలకు సుంకమేదియు నెంచరే !
కొల్ల పోవని పాలకుండది- కుడిచి కుడుపుటే నేర్వమంచు ,
వాదులెందుకు అందుకొనుడిదే అమరపానమునందురే,!!
కుడియ నెంచితి కుడియ గలనని – కుడియ నెంచితి తగిన కుడుపని!
కుడియ నెంచితి కలిమి కలుగగ – కుడియనెంచితి బలిమి కలుగగ !!
కుడియ నెంచితి మాయ తొలుగగ – కుడియ నెంచితి మహిమ కలుగగ !!
కుడియ నెంచితి కర్మ తరుగగ – కుడియ నెంచితి మర్మమెరుగగ !!
కుడియ నెంచితి బ్రతుకు మెరయగ – కుడియనెంచితి భ్రమలు మడియగ !!
కుడియనెంచితి ఎన్ని ఎందరో కుడిచినీ – కడు మురిపాల పాలను !!
చెల్లి పోయెను జీవనాడులు – వీగిపోయెను బ్రతుకు దారులు ,
దూరమెంతో ఉందనెంచిన తీరమదిగో తోచుచున్నది !
తొలగకున్నవి భ్రమల భీతులు – మరలకున్నవి ఊహ ఉరకలు ,
కరిగిపోయిన కాలమందున కరుగకున్నవి నాదు కర్మలు !
పొల్లు పోవని పాల కుడుపులు – కుడుపవైతివి కుదురు తీరును ,
నేరమెవరిది ? దోసమేవరిది ? దోగిలించెద తెలుపరే !!
పాలు నీవని కుడియ నెంచిన – పంచ ధారల బొమ్మ నేనయ!
పంతమాడక నీదు బలమును అందజేయుము నెమ్మన !!