భవతి – దేహి

గుంటూరు ఇంటిలోని పాత బాత్రూం దగ్గిర – యోగానందగారికి అమ్మ ఇచ్చిన కాఫీ , రెండు సిప్పులు తాగి నాకు ఇచ్చిన – కల .. ఆధ్యాత్మిక ఫలం కలిగిస్తుందట – కానీ ఆవిధంగా ఆశించే స్తొమత జీవితంలో లేదు ..అదే ఈ స్పందన …

దశకంఠు దునుమాడి ధరణి నేలెడివాని,
దశరద్ధానతి బడసి అడవికేగినవాని ,
ధరణిజను చేపట్ట ధనువు విరిచినవాని
ధారణందున గలుగు పవన నందనుగాను !!

లీలలేవో నెరప మనుజుడై నడయాడు ,
లోకాధిపతి నంటి లోకాన మసలంగ,
లీలా వినోదిగా దాస రూపమునొంది ,
లాలించి సేవించు అనిల నందనుగాను !!

స్వర్ణ లంకనతాను సంచరించే వేళ,
సుగుణ భూషణి యైన సురనాయకిని గాక ,
సులభ సాధ్యంబైన మణిరాసులను విడువ
సుర శేఖరుని కొలుచు వాతాత్మజు నే గాను !!

రారాజుగా స్వామి నగరి నడిచేవేళ ,
రామ పాదమే గాని అన్యమెంచని వాడు ,
రామ సమ్మతి నొంది రమణి ఇచ్చిన దండ,
రామ రుచి నెఱుఁగంగఁ కొరుకువాడను గాను!!

కేసరీ నందనుని పరిజనుల పోలికన,
కుడుచు మధు కుంజముల కోరుకుందును నేను,
కడు మోహమేపగిది మడియజేసినగాని ,
కోరి ముత్తెపు సరుల మాలలందుదు నేను !!

మన్నించు మహనీయ చిరుత మర్త్యుడ నేను,
మాయ లోకపు ఝడితి ఓర్వనేర్వగ లేను ,
మను పరంపరనిలుప మహిన నిలిపినవారి ,
మనుగడను మరిపించు మాలిమెంచగలేను !!

ఆదరించిక నన్ను ఆదుకో అవనీశ,
అదుపు ఆనతులన్ని అంతకాలముజేరె!
అడుగడుగు అడుసాయే మోసంపు మడుగాయే!!
అంతరంగము ముఱియ చిరుదివ్వె వెలుగివ్వు !!

Leave a Reply