మాయ

మాయ కుడిచెడి మోహ మొలకను – మనుపుమా నను ప్రేమతో !
మధురనేలెడి మోహనాంగుని – మదిన మొలచిన నాయికా !!

కంసు చెరలో కన్ను విప్పిన – కమల లోచను వసుధ రూపము,
కన్న వారల కనులు పండగ – కదలి గోకుల లూయలూగగ ,
నందునింటన కన్నెగా తా నవతరించిన మధురలీలను ,
మరువగలరే ధరణి నడిచెడి ఆలకాపరి అనుజులు !!

దురితులెవరో దొరలజేసిన దుడుకు పలుకుల మలము పండగ
విష్ణు వీనుల మొలచినామని విర్రవీగెడి వైర వీరుల
వికట చేష్టిత అపద ఘటనల ఆలకించిక అణచుమంచు
పద్మ సంభవు స్తుతుల నందుక పద్మనాభుని వీడి వెలువడి
మహిమ మరుగున మసలు నీ దయ మరువ తగునే మనుజులు !!

పంచ ధాతుల బొమ్మ పలుమారు పగిలినా- పొందనెంతునే నేను ప్రేమతోన,
మనసు ఖేదమునొంద బాధించు బంధాల – తగులనెంతునే నేను తమకమొంద,
నియతి నియమములన్ని ఛేదించగలయట్టి – మొనగాడనని ఎంచి మిడిసిపడెద,
తరుగు మెరుగులు త్రోవ తగిలితని ఎరిగియు -మెరుగులే కలుగంగా కొరుకుందు,
వన్నె లన్నియు కలుగు వర్ణమోకటె యైనా – తెరపువన్నెను తగుల తలచుచుందు,
నిలకడెరుగని జగతి నిలువరించెదనంచు – కొండ కొన కొమ్ములన కొలువునుందు
వేయేలనమ్మ నీ సుఖద జాలమునూగ – సురనాయకుని కొలువు కొరివిడుతు !!

మారాము మానించి మనుపవలెనేగాని – మౌనాన మరలుండ మాన్యమౌనె !
మాయ కుడిచెడి మోహ ముద్గరపు మొలకనే – మనుపుమా నన్నిపుడే ప్రేమతోన !
మధురనేలెడి దివ్య మోహనాంగుని మదిన – మహిమ గోని మొలచినా లలితవీవు!!

Leave a Reply