GOD GOD GOD – దేవ దేవ దేవ

GOD GOD GOD -అనే శ్రీ పరమహంస యోగానందగారి రచన భావానికి – నా స్పన్దన ….

దేవ దేవా దేవ – దేవ దేవా యనెద
పలుమారు ప్రతి తావు తరలు తెఱగులలో !!

నిదుర విడిచిన తనువు – లోకమెరిగెడి తరిన,
లోలోన నా ఎరుక పలుకనెంచెడి పలుకు –
దేవ దేవా దేవ – దేవ దేవా …….

కుడువ నెంచెడి కుడుపు నీ కరుణ రూపమని,
నిదుర జతలో గన్న నీ చెలిమి వీడలేక
కుడుపులో నీ రూపు కని కుడుచు తరినేను
తలతునే తానియారా – దేవ దేవా దేవ – దేవ దేవా

బ్రతుకు సమరపు బాట తరలు తీరులలోన
దిక్కు దిక్కున నీదు సూచి సూచనగొనగా
ఆర్తితో లోలోనే పలుమారు నిను తలుతు
దేవ దేవా దేవ – దేవ దేవా …

కడు కంటకములన్ని కసిరి కరిచేవేళ ,
వేదనలు ఎలుగెత్తి అరిచి ఉరిమే వేళ,
అణచి వేయగ వాని వెరపు ఉప్పెన హోరు
గళము గరిమనుపెంచి పిక్కటిల్లగ పిలుతు
దేవ దేవా దేవ – దేవ దేవా …

కలల మగ్గముపైన ఉహలల్లిన వలువ,
వన్నె పెరిగిడి తీరు పలుమారు ప్రతిసారి,
అచ్చు నొత్తెద నేను నిరుపమగు నీరూపు-
దేవ దేవా దేవ – దేవ దేవా..

ప్రతి రేయి నా నిదుర- కలల కౌగిలినొరిగి,
సంతసంబున కరిగి హాయి హాయీ యనగా
నాలోని ఆ హాయి -హాయి హాయిగ పలుకు –
దేవ దేవా దేవ – దేవ దేవా….

నడకలో కుడుపులో కలలలో బ్రతుకులో
పూజలో జపములో ధ్యాన ధ్యాసలలో
లోలోన నాలోన లోగొంతు లో పలుకు
దేవ దేవా దేవ – దేవ దేవా…………..

Leave a Reply