జన్మ జన్మల నుంచి ఎరిగితని యనుకొంటి ,
ఎరిగించగానెవరో – ఏల యని అనుకొంటి !!
ఎరుక గలిగిన తెలివి తెగులు తంపరయన్న ,
ఎరుక గలిగిననాడు – గతిగనక పొగిలితిని !!
తల్లి ఒడి జేరినా తొట్టతొలి తరినుండి ,
కడుపు కుడిచెడి కుడుపు కనగ తొందర ఆయే!
జఠర మందునజేరి జ్వలియించువాడొకడు ,
జగతి జీవన విధుల తీరుతెన్నుల తెలుపు !!
వాని గతులను గనుచు ఘటియించ నేర్చుటే ,
నేర్వతగు విద్యయని ఎంచి నేర్చితినయ్యా !!
జిహ్వ మెచ్చెడి రుచులు జీవి సందేశమని
జివికంతయు వాని కూర్చ నేర్పునుగొంటి
జీవి అలసినగాని తనివి తీరని జిహ్వ
జనన మరణపు దారి మరల జేయుచునుంది!
జటిలమౌ ఈ సుడిని చక్కజేసెడి ఎరుక ,
నేర్వనెంచిన గాని ఎరుక నెరుగగనైతి !!
తను స్పందనలనెల్ల నీదు సందేశమని
మౌనాన నాజంట నంటి నడిచెడినీదు
సంకేతముల ఫలమే మేని సందేశమని
తను అక్కరలగోరి తపియిస్తి నేనెపుడు !
తరుగైన మెరుగైన తను సౌఖ్యములగూర్చ ,
తెలియగల తీరులను తెలిసికొంటిని నేను!!
తరుగు మెరుగుల తనువు అక్కరణగగలేదు
తరుగు ఆయువు తగిన తెరపి కానగలేదు ,
తెరపి నెరిగెడి తీరు తెలయు తొందరలోనే ,
తగుల తోచిన తరుల తగిలి తరుగునబడితి !
తరుగు తొలగగజేసి తను సందడులనణచు
తీరు తెలిసెడి ఎరుక ఎరుగ నేర్వగనైతి !!
తనుబంధములవిలువ వెలయఁజేయగనెంచి,
పలు సంఘముల మసలి మన్నికేంచితిగాని ,
మన్ననైనొక పదము పాదమూనకపోయె
పలు తెఱంగుల తిరిగి తనువు సారముతరిగే!
మించు సమయమనంచు తొందరొందినగాని ,
మాలిమగు మార్గంపు ఎరుక ఎరుగగనైతి !!
జన్మ జన్మల పఠన ఎరుగనేర్వని ఎరుక ,
ఎరుగవలెనని తలచి తరచి తెరచిన ఎరుక
తలవాకిటొక వెలుగు వెలయజేయగ గంటి
తెరచి వాకిలి తలుపు తెలియగొంటిని నేడే
ఎరుకలన్నిటి ఎరుక – ఎరుగతగు నొక ఎరుక
ఎరిగించగలవాని ఉనికి తావును గంటి!!
ఆది జన్మము నుంచి వేచియుండిన ఎరుక,
ఏమరపు ఏనాడు తోడువిడువని ఎరుక ,
ఏనాడు ఏరీతి ఎరుగనెంతునో యంచు
అంటి వెంటనే యుండి గమనించు ఎరుక ,
మోమాటమేలేక పలుకు పలుకున జేరి ,
ఎరుకగొనతగు ఎరుక ఎరిగించు ఎరుక !!
రూపు రూపున తాను అనురూపియ◌ౌ ఎరుక
రూపాంతరమునందుe రూపు మాయని ఎరుక
రాగద్వేషపు దోషమంటనెంచని ఎరుక
రాలుగయిలనైనా రాగమందెడి ఎరుక
ఎరిగించగా నెవరో ఎలా ఎరుగగవలయు ?
ఎరుగవలె యను ఆశ అంకురించంగా !!
ఎడద దాగిన ఎరుక ఎద పొంగి ఎరిగించే ,
ఎదిరి లోకమునెల్ల తెలియ నాకెరిగించే ,
చేతనందెడి జగత చేతనత్వపు ఉనికి ,
చిగురుతొడిగెడి పాదు లోలోనే కలదంచు,
కని నీవు విని నీవు వివరమెరుగు మనంచు
మన్నించి మన్నించి ఎరిగించె నా ఎరుక !!
ఎరుగవలె యను ఆశ కలిగుండవలె గాని ,
ఎరిగించగానెవరో – ఏల తరలగవలయు ?
కలిగున్న ఆ ఎరుక ఎరిగి ఊరటనొంద
ఉదయ సంధ్యల లాలి ఊరటను విడెద !!