ఏకాంత మూల్యం

శ్రీ యోగానంద గారు లిఖితపూర్వకంగా సాధకులకు ఇచ్చిన సందేశం ” దైవ సాక్షాత్కారానికి మూల్యం ఏకాంతం” ఈ సందేశానికి స్పందన ….

పొరుగునెవరో యున్న తొలగియుండగనేలా,
కనులు కలిగినగాని కనగలరే నిను జనులు!
మాయకవ్వలివాడ మారాము చాలించి,
మనుపుమా మమ్మిపుడే మధురాపురీశా!!

ఇరుగు పొరుగులు లేరు ఇంట తోడేలేరు ,
పలుకు పంచగ ఇచట పరిజనులే లేరు,
పెదవి దాటని పలుకు ఆలించగల నీవు,
ఆదరంబున జేరి పంచరాదా పలుకు !!

తనువు నిచ్చిన వారి తలఁజేసితివీవు ,
ఒడిన ఆడినవారు బ్రతుకుబాటన జనిరి ,
తనువు భారంబాయే తగుల సంగులు తరిగే,
చాలదా ఈ వసతి నీ సంగమొందా !!

తెరపు మరపుల తెలివి తగిలి వీడుచునుండ,
మాలిమెరుగని మనసు మాయ మోహమునొందు ,
ఆటుపోటుల ఆట ఆనందమయ నీకు ,
పోటు ముంచకముందే పొందునందగజేయు !!

మునుపెందరో నిన్ను మన్నించి పొందిరట ,
పాపగా లాలించి – పెనిమిటిని పూజించి,
పంచి ఎంగిలి చద్ది ఎకసెక్కములనాడి ,
తీరు తెలియని నన్ను ఎరిగి నీవే తగులు !!

పెడత్రోవ పోతినేని పలుక మానుదువేమో ,
జగమంత నీవుండ పెడత్రోవ లేవి ?
పలుకు పొల్లులనెంచి తొలగుందువేమో,
పలుకు పుట్టమునీది – జత జేరి మునుపు !!
{పుట్టము : వస్త్రము . పలుకు పుట్టము నీది – పలుకులు ధరించే ఆ భావము / వస్త్రము నీదే}

తోడున్న ఈ తనువు విసిగి తొలగకముందే ,
పంచధాతువులన్ని కరిగి పోవకముందే ,
ఏకాంత కాంతులకు కాటుకంటకముందే,
కనికరించిక నీవు నా జంటనమరు !!

Leave a Reply