మధుపమందిన మధువు మధుపమై ఎగిరేను !
మదన మోహను మాయ తీరెరుగ తగునే!!
ధరణి మొలిచిన సస్య సేవనంబును జేయ ,
తనువైన సస్యములు తమ యశము గూర్చు !
తనువు తూకము పెరిగి – తను మోహమును పెంచు ,
తలుపరే సంకర్షు సైదోడు మహిమా !!
పంట నలిగే పండు ఎన్నదే తనువంచు,
తనుజేరినా తనువే తన రూపు జేసికొని ,
ఉనికి మాయును గాని గుణము మానగబోదు,
తలుపరే పరమాత్ము గుణగణల మహిమా !!
గగన వాసపు చెరిత – చెల్లజేసుక తానూ,
విభుని జేరగ కొండ కొమ్ముపై కురిసినా,
గుటక వేసిన తనువు తాప మంతముజేయు!
తలుపేరే సురవరుని సుగుణాల మహిమ!!
రామ తారక మంత్రం రూపమౌ తనయునిని ,
లోకేషు బంటుగ తానె అందజేసిన గాని –
జీవి జేరినతరిన జివికై చేరియించు !
తలుపేరే అమరేశు అతిమధుర మహిమ !!
యజ్ఞ యాగములందు హవిసునందెడివాడు ,
దహియించలేనట్టి సొత్తు నెరుగనివాడు ,
తనువు తనువును తగిలి తగినంతయే యుండు ,
తలుపరే ఆచ్యుతుని చ్యుతమైన మహిమ !!
( అత్యుతుని నుంచి వెలువడిన మహిమ )
ఉనికి లేకుండుటే తన ఉనికిగా కలిగి ,
కలిగుండు ప్రతి ఉనికి కలిగుండువాడు ,
తనుతనువు తావులను తగిలి తోలగుంచువాడు ,
తలుపరే తరళాక్షు తుదిలేని మహిమా !!
ఉనికి మాసినఁగాని గుణము చెదరగబోదు ,
గుణశేఖరుని బడయ గుణము కరుగగవలయు ,
మూలమందలి గుణము మడియమాతరమౌనె,
మదన మోహన మునుపు మమ్ము నీ దయతో!!