బారాత్

ఎదురు కోలుగ రారా – యెదుకులోద్ధవు తోన!
ఎదురు కోలుగ రారా – రఘువంశ వరు తో !!

జన్మ లెన్నో గడిచే – తనువు లెన్నో తొలగె,
తొలగు తనువుల మిగులు రంగులేవో తగిలే,
లెక్కమించిన వన్నె – వన్నె దొంతరలాయే ,
వెలితి రంగులు కరిగి – రంగు వెలవెలబోయే !!

ఎదురు కోలుగ రారా – ఎన్ని నను గొంపోవ!
ఎదురు కోలుగ రారా – పురమెల్ల కనగా!!

జపతపంబులతోన కొలిచితేనాడో
జాతరలు తప్పెట్ల తలచితేనాడో
మునిగి తీర్ధములెల్ల మొక్కితేనాడో
అలుపు అలసటదీర కొలువీయరారా !!

ఎదురుకోలుగ రారా ! ఎన్ని ననుగొంపోవ!
ఎదురుకోలుగ రారా ! ఎద నాదు నిండా!!

మనసు నిలుపగలేక కుమిలితేనాడో!
కుల కలికముల కొలిమి పొగిలితేనాడో ,
కారణంబుల రణము రాణించగాలేక,
ఒడి ఓటమి ఊట ఊరి చివికిన నాకు ,

ఎదురుకోలుగ రారా – ఓరిమందగ జేయ !
ఎదురుకోలుగ రారా – ఎదనాదు నిండా !!

వనమాలి మదినేలు అమర అంబికతోన ,
వరమౌని మందార వన కుంజములతో ,
రవిచంద్ర నయనాల గిరికన్నె విభునితో ,
ఎదురుకోలుగరారా ! ఎదనాదు నిండా !!

వైరులెల్లర నణచు వల్లీశు గణములతో ,
ప్రమథ గణములనేలు గజముఖుని సేనతో ,
అతిశయంబెరుగనా నందీశు ననుజులతో ,
ఎదురుకోలుగరారా ! ఎదనాదు నిండా !!

పార్వతీ వల్లభుని పరివార సహితముగ,
గోప కాంతలగూడి గోపాలు వెంటగొని ,
సుర సేవలందేటి శ్యామలాంబిక తోనా ,
ఎదురుకోలుగ రారా ! ఎద నాదు నిండా!!

ఎదురుకోలుగ రారా ! ఎన్ని ననుగొంపోవ!
ఎదురుకోలుగ రారా ! ఎద నాదు నిండా!!
ఎదురుకోలుగ రారా – ఓరిమందగ జేయ !
ఎదురు కోలుగ రారా – పురమెల్ల కనగా!!




Leave a comment