
నేను నేనని నేను చూచితద్దము లోన ,
ప్రతి రూపునకు బింబమందించు అద్ధంబు,
చిన్నబోయెను నేడు – ఏమి చూపెదనంచు !
భావమెరుగని నేను – భీతిల్లి అడుగగా ,
బోధించెనే తెలియ- తెలియతగు తెలివి !!
ఇది నీవే యని యంచు ఏమి చూపుదు నీకు?
ఏనాటి కానాడు కుడుచు అన్నము కరిగి ,
అస్తియై మేధమై అమరి కూర్చిన కూర్పు ,
కాలు కరములు కన్ను కాయరూపమునంది,
అమరించినీ తనువు నీవే అని యందునా !!
నిన్న నీదొక రూపు నేటికది కరువాయే .
నేటి ఈ రూపంబు కుడుచు అన్నము కూడి,
కరుగునో పెరుగునో ఎరిగించువారెవరు ,
నిలకడెరుగని తనువు నినువహించునుగాన,
నీవు తనువువుగావు – ఎరుగు – నీవెవరు ?
తనువు కలిగిన గాని కలిగుండగాలేని ,
వింత ఉనికివి నీవు – వివరంబునెరుగు!
తనువు అలసిననాడు తగిలుండియూనీవు,
తలపు లందుటెగాని తరలు తీరులులేవు,
తనువు దాసుడవీవు – ఎరుగు నీవెవరు?
ఇరువిచ్చినీతనువు ఇల సౌఖ్యములనొంద ,
సీమ నియమపు గిరుల గతులు తరలగజేయు ,
అందినా వసతులకు వన్నె తరుగాయెనని ,
తరలజేయును నీదు తలపు తీరులనెపుడు!
తనువసతి నమరించ – ఎరుగు నీవెవరు ?
కంట చూపుగ నీవు చూతు వేదో కనగ ,
తనువు చేతన యగుచు చేరియింతువేమెరుగ ,
తనువు తొడుగుది నీది – నీవంచు ఎరిగేరు ,
ఎరుగుమోయిక నీవు నీ ఉనికి నిజరూపు ,
నేనెరుగ లేనట్టి నీ లోని నిన్ను !!