చూపులో నీరూపు

చూపులో నీరూపు నిలచిపోయేదాక – నిలుపనీ నా చూపు నీ మోముపైన ,
మోమాటమే లేక పలుమారు పారాడి – మోము ప్రతి వంపులను వహియించుదాకా!
వలదన్న వినదాయె కనురెప్ప నిలదాయె – పలుమారు నీ మోము మాటుజేసేను ,
రెప్పపాటెరుగనా పద్మసంభవుడేలా – నా కంటి రెప్పలకు ఈ పాటు నొసగే!!

కలి కలతలో మునిగి కడతేరు తరిలేక – కలతపడు నీవారి కనికావగా నీవు ,
రెప్ప మొప్పలు లేని నిండు నయనములంది – కొలువుదీరితివయ్య నీలాద్రిపైన !
నినుగాన నాకున్న నయనాల కేలనో కడుభారమగు రెప్ప లమరించినావు!!
నయనాల సగపాలు రెప్ప చాటునమరిగే – సగపాలులో సగము రెప్పపాటున మరిగే!!

కనగలుగు కన్నులను కలిగున్న ఫలమేమి – కలిగించు నీ మోము కనలేని నాడు,
చూపువై నా కనుల కదలునీ జాడలకు – జడ భావనల నేల జతజేయ వలయు ?
చూపు చెదరగజేయు చింత చింతనమాని – నిలువనీ నా చూపు నీ మోముపైన,
మరలుటెరుట మరచి మరులుగొని నీ మోము నిలుపనీ కనులందు చూపుండుదాకా !!

కమనీయమగు కరుణ నొలికించు నీ కనులు – కరిగించవే నాదు మాయ మమకారంబు,
మాయ నర్తన లయల లయియించు ఈ జగతి – తగిలుండవలెనన్న నాదు మోహంబు!!
తోడబుట్టినవారు తోడైనవారు -తనుబంధముల వలన తగిలుండువారు
తలపులో తలతురని తలపోయవలెననెడి – తడబాటు నెడబాపి తెరపీయరాదా!!

కదిలాడు ప్రతి నీడ – నీ ఛాయేయగుగాక – చూపాను ప్రతిచోట నీ రూపే నిలుగాక !!
రెప్పలానిన కనులు లోచూపులో మునిగి – మాలిమిన నీ రూపు మలచి చూచునుగాక !!
చూచేటి ప్రతి కనుల చూపులో నీరూపు – నిలకడగ నాకనులు కనగలుగుగాక !
మతియందు మితిలేక మసలు యోచనలన్ని కరిగి నీరూపుగా రూపొందుగాక !!

అమ్మ కళ్ళు

” భగవంతుడు తండ్రా ? తల్లా ? ” అనే , పరమహంస యోగానంద గారి ‘ మానవుడినిత్యాన్వేషణ’ లోని ఒక ప్రవచనం లో- పరమహంస గారు తన తల్లి కాలంచేసినప్పుడు , ఆమె ప్రేమనిండిన కళ్ళను తలుచుకుని దుఃఖిస్తూ , వాటిని అన్వేషిస్తూ చేసిన ప్రయత్నానికి ఇచ్చిన అక్షరరూపం విని/చూసి – ఆభావాన్ని నామాటలలో ….

ప్రేమ నిండిన కళ్ళు – నల్లనైనా కళ్ళు ,
నా జీవనాడులగు – మా అమ్మ కళ్ళు !!
మరుగైన తరుణాన – తల్లడిల్లిన నన్ను,
చేరి చింతను దీర్ప చేరెనేన్నో కళ్ళు,!!

అరుదైన అనురాగ మొలికుంచు ఆ కళ్ళు,
ఆదరంబున నన్ను అలరించు ఆ కళ్ళు,
అభయ భావన కుడిపి భయము బాపే కళ్ళు,
కనగ నెంచిన నేను – కననైతి ఆ కనుల!!

దిక్కులన్నిట వెదకి వేసారినా గాని,
అవని ఆకాశముల అంత వెదకినగాని,
కనుపించు ప్రతి కనుల తరచి చూసినగాని ,
కననైతి ఆ కనుల పోలికొందిన కనుల!!

అలసటెరుగని వేట వొమ్ముకానేకాదు ,
మరుగు వీడిన నాడు ఎరుక గొంటిని నేను!!
నల్లనైనా కనుల నగరి ఎల్లలు దాటి,
పోలి లోకములెల్ల లాలనెంచగ గంటి!!

నలు దెసల నిండినా ప్రేమనిండిన కళ్ళు ,
ననుగన్న నాతల్లి అంది చుసిన కళ్ళు,
నేడు నను నిరతంబు కాచుటెఱిఁగిన నాడు ,
కంటకంబులు కరిగి కలిగే మోదంబు

తగిలుండు వాడు

రామ రామా రామ – రామ రామా రామ
రామ రామా రామ – రామ రామా!
రామ రామా రామ – రామ రామా రామ,
రామ రామా రామ – రామ రామా!!

తనువున్న లేకున్న తగిలుండు వానొకని
తలుపదే నా మనసు తగిలుండగాను !!
పెడత్రోవ పయనాన నలిగి పొగులుచు తాను
కటిక కాటుక చాటు కరుగనేలెంచు?

రామ రామా రామ – రామ రామా రామ
రామ రామా రామ సాకేత ధామా!
రయము నానతి పలుకు – మనసు నాదెరుగంగ,
రామ రామా రామ – రామ రామా!!

నాదమై పలుకులో తగిలుండువానొకని
తలపదే నా మనసు తగిలుండగాను !
పలుకు పదముల లోని పొంగు పొల్లులు తలచి
పలు సుడులలో మునిగి ఎలా నలిగేను?

రామ రామా రామ – రామ రామా రామ
రామరామారామ రఘువంశ సోమా,
రాయము నానతి పలుకు – మనసు నాదెరుగంగ!
రామ రామా రామ – రామ రామా!!

ఉరమునందూపిరై తగిలుండువానొకని
తలపదే నా మనసు తగిలుండగాను !
సోహమందున తొణుకు తడబాటు తలపోసి ,
తగని తావులనెంచి తొలగనేలెంచు ?

రామ రామా రామ – రామ రామా రామ
రామ రామా రామ రణరంగధీర!
రయము నానతి పలుకు – మనసు నాదెరుగంగ!
రామ రామా రామ – రామ రామా!!

చేతనై తనువంత చేరియించువానొకని ,
చింతించదే మనసు చెరితయందెపుడు !
చితికి చింతల చిమిడి చెదరి బెదరుచుతాను ,
చితి చేరు దారులనే దొరలనేలెంచు?

రామ రామా రామ – రామ రామా రామ
రామ రామా రామ – రామ రామా!
రామ రామా రామ – రామ రామా రామ,
రామ రామా రామ – రామ రామా!!

లోకమేలేవాడు

లోకమేలేవాడు లోనే ఉన్నాడంచు
లోకులందురు తెలియు మనసా!
లోకాల ఏలికన అలసిపోయిన వాడు –
నీగూటిలో చేరే తెలుసా !!

కాల నియమములెంచి కాపు కాచెడివాడు,
కలడు నీయందెనట తెలుసా?
నిలకడెరుగని కాల నియమ పాలననెరుగ,
నీ గూటిలో నిలిచే తెలుసా
మనసా ! నీ గూటికేచేరె తెలుసా !!

అమ్మలందరి అమ్మ – కడు చాల పెద్దమ్మ,
గూడు నీ కొసగెనట తెలుసా ?
అమ్మ సేవలనంది ఆయాసపడువాడు ,
నీ గూట నిదురించు తెలుసా !!
మనసా! నీ గూటికే చేరు తెలుసా!!

గుణము లెరుగని వాని గుణ వైభవములెన్నఁ
వాణి నిను చేరేనట తెలుసా ?
వాణి పలుకని పలుకు తానైన ఆ పలుకు,
నీ గూటిలో ఒదిగే తెలుసా!!
మనసా! నీ గూటి నాదమది తెలుసా!!

జగతి చేతన నొంద చేరియించువాడొకడు,
నీలోనే మెదలెనట తెలుసా?
అలజడుల చాలించి ఆనందమొండగా,
నీ గూడు చేరేనట తెలుసా!
మనసా! నీ గూటి నిలకడని తెలుసా!!

లోకమేలేవాడు లోనే ఉన్నాడంచు
లోకులందురు తెలియు మనసా!
లోకాల ఏలికన అలసిపోయిన వాడు –
నీగూటిలో చేరే తెలుసా !!

దారి తప్పిన చిలుక!

దారి తప్పిన చిలుక-చేరెనేదో గూడు,
గూటి నియమములెంచ వీలు కానకపోయే!!
సాకులేవో తలచి సంచార మెంచితే ,
సరిదారి కరువాయె – కననెవరు లేరాయె!!

కనులుండి కనలేని – చెవులుండి వినలేని,
కదల చేతనలేని కర పాదములు కలిగి,
మెదలకుండిన గూటి గతిగన్న ఆ చిలుక,
తన చేతననుపంచి గూట దీపమునుంచే !!

చూపు చేరిన కనులు చూచే లోకమునెల్ల ,
సోకె వీనుల యందు వింత నాదములెన్నో!
గూటి వసతుల వలన కలుగు వసతులనెంచి ,
విస్తుబోయిన చిలక గూటి సంగము గోరె!!

చేతనందిన గూడు చేరియించె లోకాన ,
ఉల్లసించిన పదము లెన్నో దారుల నడిచే,
మిట్ట పల్లపు దారి – వన వైభవపు దారి,
అడుసు మడుగులదారి – మోహామొందుచు నడిచే!

పవనుడాదరమెంచి పలుకరింపుగ చేరి ,
చెరించ రమ్మంచు పలుమారు దరిజేరె!
వొల్లనన్నా వినడు గూటి గుమ్మము విడడు,
సందడందుచు ఎదో వింత స్పందన నెరపే!

హంస గమనపు సొగసు గూటి సోయగమాయె ,
గాలి దూరిన గూడు గుసగుసల ప్రోవాయే !
గుస గుసలు పలుకులై పెదవి వాకిలి దాటి,
పొరుగు గూటిని చేరి పొంతనల పుంతాయె!!

రెప్ప రెపరెపలందు ఒరిగి మొలిచే జగము,
ఒలకబోసెడి చలువ అందాల వెల్లువలు,
కనుల చెలియలి కట్ట కరిగించి కవ్వింప,
చూపే కన్నుగ మారి కంటిలో కోలువాయే!!

మాయ నర్తన చూచి మైమరచినా కనులు,
కల్ల కలలన దేలి కబురులేవో కుడిచి,
గూటి వసతుల వసతి వైభవించకనెంచి,
యోచనల వలయాల మడుగులో మునిగేను!

మోహ యోచన మునక నిమ్మదించిన నాడు,
మరలి పోదుననంచు మరుల మునిగిన చిలుక,
ముగియుటెరుగని మునక ఘన ఘోర గమనాన ,
గతి మరచి గురి మరచి గూట గుట గుట లాడే!

మాయ పెను సంద్రంపు ఆటుపోటుల ఆట,
ఆడించువాడెవడో – ఆడువాడెవడో ,
నడుమ నలిగిన గూడు చెదర – బెదిరిన చిలుక,
గతిమాని నీ గతికి పొగిలి నలతన నలిగె!!

పంచి ఇచ్చిన చెలిమి, చేతనల చవిచూసి,
మిడిసిపడినా గూడు విడువనొల్లననంది,
పెనుగులాటన నలిగి బెదిరి పోయిన చిలుక,
వీడు విడువుమనంచు విన్నపంబులు పలికే!

పొరుగింటి చిగురాకు రుచులు కోరగరాదు,
ఇరువిచ్చినా గూడు వసతి తాననరాదు ,
చెల్లు కాలము వెంట చెదిరిపోయే గూడు,
చేది పంచిన రుచుల రమియించ – మనరాదు !!

ఎరుగవే ఓ చిలుక – ఎగురు దారుల గురిని,
గురుతు తెలిపెడి వాని సంగతంబును గొనుము !!
గత సంగతుల గతిని వాని ఉనికిన విడుము ,
విడువ వేడుక విడుము – వాని సంగము విడకు !!

దారి తప్పిన చిలుక – పెడ దారి పయనమున,
తరల తామసహరుడు హరియించు నా దారి!
దారి వివరము తెలుప – చేరు గూటిని చిదిమి ,
చేదుకొందుననంచు తన ఉనికి తెలిపేను!!

5th June 2026

26th April 2026 -వకుళ పోయిన సందర్భం లో – తన సరైన వైద్య నిర్ణయం తీసుకోలేక పోయినందుకే , వకుళ దేహం రాలిందని – తిప్పుకోలేని బాధ పడుతున్న బుజ్జి ….

నిలకడెరుగని కాలమేలనో నిలిచిపోయెను నేడిలా !!
నాడు నేడుగ మారిపోయిన – మారకున్నది యోచన !!

అలుపేరుంగని దినకుండట గగన విధుల తరలినా.
తేటవెలుగుల సుధాకరుడట కళలలెన్నో మార్చినా ,
కలువ కన్నులు కలల దేలుచు కమముల మేల్కొల్పినా
కదలదాయెను కాలమేలనో నేను నిలచిన తావున !!
నాడు చెదరదు నేడు మొలవదు – మారకున్నది యోచన!!

ఎన్నడో ఏనాడో ఎపుడో ఏమి యోచన నెంచినాడనో ,
వొల్లనన్నా వెలుగులేవో వెంట వెంటన మసలుటెరిగితి,
కరుణ నెలనో కురియజేయుచు కొసరి సంకట మొల్లజేసిరి ,
సరసులని నే నాదరంబున నమ్మి ఏమరిలుండు తరిలో,
ఎలానో ఏమాయెనో మరి వెలుగులేలనో కల్లలాయెను !!

కాలుడల్లిన కఠిన శాసన మొల్లనైతిని ఎలానో ,
కామితంబులు కురియు మౌనులు మోవమందిరదేలనో !!
కాటువేసిన కాలమేదో కాలమందున కరిగినా ,
కాటుకంటా కాటు నేటికీ – నేటిదే యని సలుపుచున్నది !!
పాపవైరము పుణికి పుట్టిన భావవైభవ మెంచనేలనో ,
చేతలుడిగిన చేతనంబున చరియించు చేతన నొల్లనేలనో!!

కనికరంబున కలుగజేయరే కల్లగానా కరుణ స్పర్శను,
ఉడిగి చేతన చెదర నేరని నేరభావన నపహరించరే ,
ఆది అంతము లవధులెల్లను అలుముకొన్నా కటిక ఛాయను ,
కుటిల కుంతల కోమలాంగుడు కోరి కొరతను వేయడే!
కామ సంకట కారణంబుల పెకలి పీచమడంచరే ,
కామ జనకుని కరుణ కొలనను మోహమున నను ముంచరే!!

వొల్లనిక నే నెవరి పలుకులు – వొల్ల బోవను ఎవరి సరకును,
వొల్ల జాలను జనుల చరితను – వొల్లనే నే నెవరి బోధను,
వొల్ల నొల్లను కనుల తోచెటి వెలుగు నీడల రూప ఛాయలు,
యోచనందున తోచు ఊసుల ఉనికి నేనిక వొల్ల బోవను,
తెరపి తలపుల తేట తెలివిని తగులజేయుము గురువరా!!
దుడుకు నడతకు కుదురు జేర్చుము – దీనతను నీ వపహరించుము ,
రాజ మార్గపు రాచరికమును రయమునిక నీ వందజేయుము!!
వందనంబిదే అందుకొనుమయ – ఆదరంబున ఆదుకోవయా!!

వినక తప్పదు

ఎవరి మొరలాలించి ఏమరలి యున్నవో !
దిక్కునీవే యన్న మనవి వినకున్నావు!
కాచినా కసిరినా నను కన్న దొరనీవు.
మాలిమెంచకయున్న మనుగడేదయ్యా !!

వాసవాదులు నిన్ను వీడకున్నారంచు
మునులు నీ పదములను పట్టియున్నారంచు,
పాల్కడలి పరమేశి సేవ సుఖములదేలి ,
పిన్నవాడగు నాదు పిలుపు నొల్లవదేల !!

వినత కొమరుని వంటి బలము కలిగిననేని,
కరుణింతువేమొ నిను వహిఇంపగాను !
వినత సోదరి పుతృ పోలికొందిననేని,
పరుపుగా నీ కరుణ కలిగుందునేమో !!

మొసలి బారిన పడిన గజరాజు గావగా ,
తరలు తొందరలోన తగిలియుంటివో ఏమో!
చిననాటి చెలికాని చేతి అటుకులరుచిన,
మురిసి మురిపెములోన మునిగుంటివేమో!!{

నీ దివ్య లీలలను భావించి రమియించి
రచన జేసెడి భృత్యు భావ సంకలమంది
తగిన పంక్తుల పద్య పూరణంబును జేయ ,
చాటు మాటుగ మసల వేచియుంటివో ఏమో !!{పోతన}

రంగ రంగాయంచు సేవించు సతి వినతి ,
మన్ననెంచిన నీవు పతిసేవలో మునిగి,
ఆడవేషమునందు అతలకుతలంబగుచు,
కలి కంటకపు ముడిన మెదలకుంటివో ఏమో!!{సక్కుబాయి}

కాలపాశమునుండి పసివాని కావగా,
కదలి తొందరనొంది తరలుచుంటివో ఏమో!
కటిక పాషాణంబు విలయ నర్తననాపి,
ప్రీతితో సేవింప ఉత్సహించితివేమో !!{భక్త మార్కండేయుడు- శివుడు}

అధికుడని నేనంచు విర్రవీగెడి తండ్రి,
సంకటంబులు కుడుప- నీ వైభవంబెంచి ,
నీ నామ రుచినంది రమియించు పసివాని ,
పలుకులందగ శిలన వేచియుంటివో ఏమో!!{నరసింహ అవతారం}

పలు పందెములనోడి పడతినొడిన పతుల ,
తరుగు ధీరత గాంచి ఓడనొల్లని వనిత,
దిక్కు నీవని ఎరిగి ఎలుగెత్తి పిలిచెనని ,
అంతమెరుగని వలువ వర్షించుచుంటివో !!{ద్రౌపతి-కృష్ణుడు}

వేళ గానొక వేళ విచ్చేసినా అతిధి ,
శత శిష్య పరివార పరిచరియ లందింప ,
పాక శలన నిలిచి పరితపించిన సఖిని,
మిగులు నలకను నమిలి ఓదార్చ ఉరికితివో!!{ద్రౌపతి-కృష్ణుడు}

చేతులారగ నీకు శృంగారమలరింప ,
కనక మాణిక్యాల కవచములు కుర్చగా
దొరల సొమ్ములు తెచ్చి దోచి పెట్టెననంచు
చెరన ఉంచిన వాని సొమ్మీయ తరలితివో !!{భక్త రామదాసు -రామలక్ష్మణులు}

తలపులన్నియు నీదు తలపులై నిండఁగ,
పారాడు పసివాని పాదముల నలిపినా ,
భక్త భక్తికి కరిగి – పసివాని బ్రతికించి
మహిమ చూపుటయందు మైమరచియున్నావో !!{భక్త కుంహార్}

పసి మనసులో నిన్నే పతిగ భావనజేసి ,
భవ బంధములనెల్ల కల్లలని తలపోయు,
అతివ అందిన గరళ పాల కలశము నంది ,
నందగోకుల నటన నడుపంగ కదిలితివో !!{భక్త మీరు – కృష్ణ}

ముదిమి నొందిన జనకు పదసేవ జేయుచు,
మదిన నీ వైభవము తలపోయగా నెరిగి,
తగుదునమ్మా యంచు తరలిపోయిననిన్ను,
నిలువరించిన దాసు రాకకై వేచితివో ! {పాండురంగడు}

ఆటలేవో ఆడి సేదదీరగ నెంచి,
ఏడు కొండలు నడిచి సఖుని సంగముబడయ,
సఖుని దోషము నెంచి చెరకు విందీయగా ,
దంతివై విందంది విశ్రాంతినొందేవో !!{హత్తిరమ్ బాలాజీ}

పడతి ప్రేమను పొంద తనువులో సగమిచ్చి,
ఎడబాటు ఏనాడు ఎరుగనొల్లని నీవు,
నవ యవ్వనపు తళుకు లొలికించు పడతికై
తరలు తొందరలోన తగిలుంటివో ఏమో!{శివుడు-మోహిని}

భక్త సులభుడవంచు భజన జేసెడివాని,
కల్లలెరుగక నీవు కురిపించినా కరుణ ,
వైరమై వెంటాడ వెఱపుఁనొందిననీవు,
దీనరక్షకు నునికి వేటాడ తరలేవో!! {శివుడు (భస్మాసుర వరం)

అన్నదమ్ములు కలసి చిలికి అందిన అరకు,
సురవైరులకు సగము పంచనొల్లక తలచి,
మాయ మచ్చికతోన మగువ వేషము గట్టి,
తొండి పంపకమందు తగిలియుంటివో ఏమో ! {మోహిని అవతారం}

కలి కాలి అందెలకు మౌనమందగజేయ ,
కాకాని కొలువులో కొలువుదీరితివేమో !!
కామితంబుల కొలిమి కొడిగట్టు అరకిచ్చి ,
ఆర్తి ఖేదములణచ తొందరొన్దితివేమో!!{శ్రీ రామకోటయ్య గారు}

ఏమేమి జేసినా – ఎవని కొరకేగినా,
కొరత తగదయ నీకు నా మొరలువినగా!!
కాచినా కసిరినా నను కన్న దొరనీవు.
మాలిమెంచకయున్న మనుగడేదయ్యా !!

కాపలా

మట్టి బొమ్మను చేసి – మాటాడ మన్నావు,
మాట పలికెడి బాట నివేయనన్నావు ,
మాట నుడికారంపు లోపమేదో తలచి,
మరుగు దారుల మమ్ముమరిలించతగునా !!

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

రంగురంగుల జగతి కనమంచు కనులిచ్చి,
కనులయందలి చూపు నీవేయనన్నావు !
చూపు చూపెడి జగతి చూచిమురిసిననాడు ,
లోపమేదో తలచి తగదిదని అన్నావు !!

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

చినుకు అడుగుల ఆట – గండు కోకిల పాట,
వీనులింపుగ వినగ వసతి నందించావు,
వాదమేదో దూరి వీనులలసిననాడు ,
కల్ల వంకలనెన్ని పెడనుండమంటావు !!

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

కాళ్లు చేతులు నావి – కదలు జీవమునీది,
కదిలి చేసెడి పనుల కారణంబెవరయ్య ?
పనితనంబున దొరలు పొల్లులోవోఎంచి ,
పలు దండనములెన్ని దొరలుమందువదేల !!

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

భావాలు భోగాలు భవ బాధ కధనాలు ,
కూరి కుడిపిన బొమ్మ – దూరమంటివి నన్ను!
యోచనంతయు నీది – యోగమంతయు నీది!
కలుగు కంటక మందు సంకటము నాదెటుల !

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

కనుల పొంగెడి నీరు – కననీదు నీ జగతి!
వీనులందలి హోరు విననీదు ఏ సడిని!
పలుక పదములు లేవు – పారాడ పసలేదు !
పాలకుండవు నీవు పంతమెన్నగబోకు!

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

లోని కలవరమేదో కననీదు – విననీదు ,
కారణంబులు తెలియ తగిన తీరేలేదు !!
వాదులాడగ నాకు తగిన యోచన లేదు!!
కలిమి బలముల ఆట ఆడి అలసితినయ్యా !!

కంచె మేసెడి చేను కాపుకాసేదెవరు?
కన్నవాడివి నీవే కబురంపరాదా!

మేలుకొలుపు

పాల పుంతల దారి పలుమారు నడిచినా ,
పాలుపోదయ – జగతి నడిచేటి విధము!
జోలలూట మాని జగతి నడతను గనుము,
జోగి ఊగుచు – నడత తూగి తూలేను!!

తండోప తండాల జనులు నీ గుడిముందు,
నిలచినారయ నిన్ను కొసరి కొలువంగా!
పట్టెడన్నము పుట్ట ఇక్కట్లు పెక్కాయె,
భక్తి కాదయా వారి బ్రతుకు భయమాయె!!

జోలలూట మాని జగతి నడతను గనుము,
జోగి ఊగుచు – నడత తూగి తూలేను!!

భోగాల నిను ముంచి సేవించినేగాని ,
బ్రతుకు గడులను గడప తోడీయబోవంచు,
పంచ ధాతువులంది పూరించినా పురిని
పలు ఇడుములన వ్రేల్చి వేడుకొందురు నిన్ను !!

జోలలూట మాని జగతి నడతను గనుము,
జోగి ఊగుచు – నడత తూగి తూలేను!!

మోసాలు వేషాలు కలత కావేషాలు ,
కొమ్మ రెమ్మలు విరిసి విస్తరించిన జగతి,
జాలి దయ యను గొప్ప భావమందినవారి
జాలి ఇంచుక లేక దురితముల కూరేను!!

జోలలూట మాని జగతి నడతను గనుము,
జోగి ఊగుచు – నడత తూగి తూలేను!!

పాలసంద్రము చిలికి పలు సంకటములోర్చి
పట్టి తెచ్చిన అరకు ధన్వంతరి మరచేను!
ఫాలాక్షు నూపిరుల కంఠమందలి అరకు ,
కట్టడెరుగక జగతి సంచరించేను !!

జోలలూట మాని జగతి నడతను గనుము,
జోగి ఊగుచు – నడత తూగి తూలేను!!

వేడుకున్నా కసురుకున్న ఆగదాయెను కాలము
తప్పుకొనగా దారిలేదని కనులు కురియుట ఆగదు,
కన్న వాడవు కాచువాడవు కలిగియుంటివనెంచినా ,
ఇన్ద్రియంబులు ఎరుగునటు నీవేలనో యేరుగుండవు !!!

జోలలూట మాని జగతి నడతను గనుము,
జోగి ఊగుచు – నడత తూగి తూలేను!!

కల

17th May 2026 :కలలో పూరి జగన్నాధ విగ్రహం నాదగ్గిరకి వొస్తూ – ఒక తెల్ల లాల్చీ , పంచెకట్టు తో ఉన్న ఆజానుబాహుడైన 50+ వయసు కల పురుషుడిగా నాదగ్గిరకు వొచ్చి, నన్ను వెంట బెట్టుకుని బ్యాంకు కౌంటర్స్ లాగా ఉన్న అనేక కౌంటర్స్ తిరుగుతూ , నా విషయం ఏదో అడుగుతున్నాడు. నాకు ఏమి వినిపించలేదు – కానీ ఆయనను చూస్తూ , వెంట తిరుగుతున్నాను. …. అదే ఈ కవిత …

కలలోన కనిపించి మరుగైన ఫలమేమి !
కలిగుండవలె నయ్య ఇల కనులయందు!!

రెప్ప లేనాకనులు నా కనుల రెప్పలలో ,
ఎక్కడో ఏమూలో ఒదిగి దాగగ నేల?
రెప్ప లానినిన కనులు కనిన ఆ అందాలు ,
కురియవే నా కంటి కనుపాప పైన !!

జత గట్టి నాతోన అడుగులేసిన జాడ,
జంటగా నా వెంట సంచరించిన జాడ ,
వెంట గోని నీ ఉనికి నన్ను నడిపిన జాడ,
కల కరిగినాగాని కరుగకున్నది కనుల !!

నిను గన్న సంతసము తనువంత తడుపంగ,
కనుల జేరెనో ఏమో ఇన్ద్రియంబుల ప్రజ్ఞ !
నీవాడు వచనాలు సోకవైతివి చెవిన,
సోకునీ వస్త్రంపు హాయిగొనదీ తనువు!!

లీలావినోదుడా – ఆడ నే లీలలలను ,
పలుమారు పదుగురిని వివరముల నడిగేవు !
వివరమడుగగ నీవు ఎవరనెంచిరో వారు,
వారు వీరని నిన్ను పలు దెసల పంపేరు!

దశ దిశల దిశ దిశన తీరి నిలచిన నీవు,
ఏ దురితములు మాప దయబూని దరిజేరి,
రెప్పలానిన కనుల సంచారమొనరింప ,
సంగతేదో గాని సంగమును విడబోకు!!

కర్మలెన్నో కూడి కొండలై నిలిచినా ,
నీదు నెయ్యపు చ్ఛాయ చేరవొచ్చెను నన్ను!
చెదరనీయకుమైయ్య చెలిమి సంగము నెపుడు,
చేదుకొని ఓదార్చి – కుడుపు చెల్వమును !!

కనురెప్ప పరదాలు పలుమారు మూసెదను,
కనికరము గొనినీవు మాటువిడి మురిపించు,
మంతనాలేవైన మనుప మా గతినీవే !
మదనాంతకుని మనసు మురిపించు వాడా!