భావన

పద్మిని మనోభావాల అక్షర రూపం.

తను బంధములు వీడి తరలిపోయిన తల్లి,
తనువెల్ల తానైన నా కన్నా తల్లి!
తలపు పూబంతులను – తన తలపులందించి ,
తరలిపోయెను తాను తన పయనమందు!!

మనసు ప్రతి పొరలోన ఒదిగిన్న ఆ తలపు,
మెదలి రూపము నొంది కంటి పాపను తాక ,
నాడు రుచి తోచనా చిరు తలంపుల చినుకు,
నేడు కరువాయెనని నిండెనే కనులు !!

కనులు కురిసే చినుకు చేరి నీ చేరణాలు ,
నడక అలసట తీర్చి సేదతీర్చునుగాక !
అమర పాద్యములందు అందనా ఆదరము,
అందజేయునుగాక నాకంటి ఈ చినుకు !!

చిట్టి చినుకుగ నాదు కన్ను వీడిన చినుకు,
నీదారి పచ్చికకు ఊపిరులనూదగా
పదమాను ప్రతిచుట లీలగా నిను తాకి ,
తలపింపజేయులే నా తలపులను నీకు!!

అంతమెరుగని దారి తరలిపోయెడి తల్లి !,
అలసటోల్లగ జేయు పిల్ల తెమ్మెర ఉనికి ,
అందజేయును నాదు తడి ఊపిరని ఎరిగి,
సేద దీరుచు నీవు నీ పయమున సాగు!!

నాటి ఊసుల ఊహ ఊపిరుల నాడగా
ఊరి నా కన్నీరు వాగు వంకలు అగుచు
ఉరక నీ పయనంపు పడవ నడవంగా,
తెరపి తేరున నీవు తరలిపోవమ్మా !

రాదారి పడవలా సాగాలి నీ దారి ,
ధరణి బాధల తలపు తలుపకెన్నడు నీవు,
నీవు నేర్పిన విద్య వివరమెరుగుచు నేను,
బ్రతుకు గడిపెదనమ్మ గడువుండువరకు !

నీ దారి చెందురుల చలవు సోకిన నాడు,
నీ పున్నెముల పుటలు భవుడు మెచ్చిన నాడు,
నీ ఉనికి ఊరటన ఉద్ధతొందిననాడు
దీవింపవే నన్ను నా కలలు పండ !!

తోడు విడువని తోడు

పంచ వన్నెల గూడు – దూరినా వీడినా
ఉలుకు పలుకూ లేక వెన్నంటి నడిచేవు!
ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

రే పవళ్ళను నడుప నిలకడెరుగక నడచు ,
సూర్య చంద్రులు నడచి చేరు గమ్యమునెరుగ,
నింగి దారుల నేను నిలిచి చూచిననాడు,
జంట నుండిన నీవు పలుకవైతివి ఏది !

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

జనన మరణపు దారి మరలనెంచని వారు,
జర చెరన నలుగుచూ వెతలనొందెడివారు ,
జారిపోయెడి తనువు తగిలుండవలెనంచు ,
పంతమెంచెడి వారి పలు ఘర్షణలకనుచు ,
ఉద్వేగమేలేక ఊరకుండుట కంటి !

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

పంతాన పలుమారు అతిశయించిన వారు,
అవని ఆకాశముల నేల నెంచినవారు ,
అమరులము మేమంచు ఆదమరచినవారు,
కాల కౌగిలి నొరిగి జారీ పోవుచునుండ,
జంట బాయక నీవు తగిలి యుండఁగ గంటి!

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

పశువైన శిశువైన పరమ పండితులైన ,
యాగశాలల యందు యజియించు వారైన,
జూద వాటికలందు రమియించు వారైన,
మొద ఖేదములన్న భేదమెంచగ బోక,
తగిలుండి ప్రతి జీవి జంటనుండుట కంటి!!

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

జగమేలు నాయకుడు జగతిదారులవెంట ,
పురములేవో బడసి పయనించుచుండగా ,
పాలకుండని ఎంచి ఎడమెంచగాబోక ,
పట్టి పంతముతోన పురము పాయలయందు
మూగనోమును బట్టి మెలఁగుచుండుట గంటి !!

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

కుడుపు నోచనివారు – కుడుపు నోపనివారు ,
కలిమి లేముల త్రాసు తగిలి యుండెడివారు!
పున్నెముల పుట్టైన హెచ్చు నెంచగబోవు ,
పెడ పున్నెముల మునిగి మురుగువారాలనైన ,
పెడ మొగము గొని నీవు పెడనుంచి గనలేదు!

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

మనసు నడచెడి దారి మసలనెంచెడివారు,
మనసు పగ్గముపట్టి నియమమెంచెడివారు ,
మనసు మనుగడ మాప పరితపించెడివారు,
మనుప మనసేలేని మాలిమెరుగనివారు ,
మను దారి ఏదైన తగిలుండగా గంటి!!

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

తనువు తీరినవారు – తనువు కోరెడివారు,
తనువు తారణ తరిన తగిలున్నవారు,
తనుము తమకమునంది తుదిమరచువారు,
తలపు మోపున మడిసి తెరపెరుగకున్ననూ
తొలగుండగాలేక తగిలియుండుట కంటి !!

ఏ దేశమయ నీది? ఏ పనులనెంచేవు?
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవు?

పాలనెంచవు నీవు – పంతముల పొడ బోవు,
పలుమారు నిను వేడి శరనొంద పనిలేదు,
ఏ కారణము చేతొ ఎవని ఆనతి వల్లొ
ఎడబాయకేల్లపుడు తగిలి యుందువు మమ్ము !

ఏ దేశ వాసివో! ఏ పనుల నెంచెదవొ!
ఏ ఆశ గొనినీవు జత విడక నడిచేవొ!
ఎరుక ఏలను నీవు వివరింపవని అడుగ!
జీవ యాత్రాన నేను అలసినా ఒరిగినా ,
తోడు విడువని తోడు కలిగుంటినని మురుతు!!

మిధ్య

Mother’s Day – 2026

తల్లి మిధ్య ట తండ్రి మిధ్య ట – తగిలియున్నీ తనువు మిధ్య ట!!
మిధ్య మిధ్య ని పలువరించే – మిధ్య గానా సత్యమేదిట!!

మహిమ గలిగిన మాన్యులెందరొ – వేదమెరిగిన విబుధులెందరొ,
వసుధ నడచిన వంద్యులెందరో – వెదకినారట సత్య మేదని?
జాడలివి యని గురుతులివియని – ఎరుక పరిచెటి విధములేదని,
మౌనమున మునిగుండి తెలియుట – తెలివి తెలిసిన త్రోవయనిరట!!

తల్లి మిధ్య ట తండ్రి మిధ్య ట – తగిలియున్నీ తనువు మిధ్య ట!!
మిధ్య మిధ్య ని పలువరించే – మిధ్య గానా సత్యమేదిట!!

అమరవీధుల దారులందున అలసటెరుగక సంచరించుచు ,
భాను తేజపు తాపమంతయు తాను తనువున మడియజేయుచు,
తాపముల తరలింపజేసెడి తరుణ చలువల చంద్రకాంతిని ,
అందుకొనుడని పంచి ఇచ్చే సుధాకరుడును మిధ్యయేనట !!

తల్లి మిధ్య ట తండ్రి మిధ్య ట – తగిలియున్నీ తనువు మిధ్య ట!!
మిధ్య మిధ్య ని పలువరించే – మిధ్య గానా సత్యమేదిట!!

అవని నడచెడి జీవులందరి ఆలనను తా నందుకొనుచు ,
ఆరు ఋతువుల వన్నె చిన్నెల వైభవంబుల నందఁజేయుచు ,
జీవ యాత్రకు వలయు వనరుల వివరముగ తా నమరజేయుచు,
బడలి ఒడిలిన ఒడిన జేర్చెడి తల్లి ధరణియు మిధ్యయేనట !!

తల్లి మిధ్య ట తండ్రి మిధ్య ట – తగిలియున్నీ తనువు మిధ్య ట!!
మిధ్య మిధ్య ని పలువరించే – మిధ్య గానా సత్యమేదిట!!

సాధు సంతుల సంగమందున – విరియు ఆమని హృదయమందున ,
చేతనై ఈ చరాచముల చెరియింపజేసేడి చలనమందున
వలదు భయమని ఊరడించే ఉభయ మెరుగని లాలనందున,
ఓరిమిన నీవెరుగగలిగిన మిధ్యగానా సత్యముందట !!

తల్లి మిధ్య ట తండ్రి మిధ్య ట – తగిలియున్నీ తనువు మిధ్య ట!!
మిధ్య మిధ్య ని పలువరించే – మిధ్య గానా సత్యముందట!!

ఒరిగి మొలుచుట – మొలిచి ఒరుగుట – తీరుగానా శుద్ధ సత్యము ,
మిధ్య మనుగడ మనుపజేయుచు మాలిమిన నీ మనుగడాయెను!!
ఆటవిడుపుకు అందుకొన్నా మిధ్య మాలిమి మడియజెసుక,
తెలివి తెలుపని తేట సత్యము తెలివి తలుపులు తెరచి తెలియుము !!

తల్లి మిధ్యని తండ్రి మిధ్యని – తగిలియున్నీ తనువు మిధ్యని !!
మిధ్య మిధ్య ని పలువరించే – మిధ్య గానా సత్యమెరుగుము !!

గూడు

అల్లిరెవరో గూడు అలరింపగా నన్ను,
ఆదరించొసగితిరి వసతి నొందగ నేను,
అనువైన కాకున్నా ఇలనిదే ఇరువంచు
ఎరిగించినారెవరో సమ్మతే గతియంచు!!

కాలమల్లిన దారి ఒల్లనన్నాగాని
చెలిమి నేదో నెరపి దొరలించెనాదారి !
తెరపైన అడుసైన అడుగరెవ్వరు నిన్ను,
ఓరిమొందుటె మేలు ఒరలి ఫలితము లేదు!

గురుతుతెలియని వారు గురుతుగొను మన్నారు,
లోకాన గురుతులివే గోని తరలుమన్నారు!
తల్లులట తండ్రులట అన్నక్క తమ్ములట,
ఒట్టిమాటలె అయినా ఒప్పి మసలుటె దిక్కు!!

సూర్య చంద్రుల రధము దొరలుటాగగ లేదు ,
యోచనేదో యదన ఉదయించి మరుగవదు!
మాయ గంతల మరుగు నలిగేటి నా కనులు,
తెరపి నొందగ లేక పలు పంతముల నలుగు!!

హిమ నగంబుల నగరి నేలేటి రాయనికి ,
మురిపాలుకుడుపగా మనసైన మాయమ్మ,
కంట కురిసిన అరకు కుడిచినా హరిసుతుడు,
తనుకుహరముల జేరి హరియించు హరితలపు !!

గగనాలు గహనాలు ఎడతెగని అందాలు ,
మయుని కల్పనమించు కమనీయ కల్పనలు ,
కనువిందు కలిగించు కనికట్టు లోకాలు,
అందవచ్చుననన్న భ్రమ మరువదీ తనువు!!

తోయమందలి తళుకు – అనిల గంధపు సొగసు,
అంది ఆదరమొంది మురియ మానని మనసు,
తళుకు నందగలేదు – గంధమును గొనలేదు,
ఉనికి కరవగువాని కొనెడి కోరిక విడదు!!

ఏ కోరికలు కోరి ఇట ఓస్తినో తెలియ ,
తెరిపెరుగనీ బాట దొరలు కరణ మెరుగ!
కనులు కని మురిసేటి కమనీయ కధనాలు,
ప్రభవించు పాదులను కను దారి కననాయె!

పదునారు భువనాలు పదివేల కళలతో
భాసిల్లగా తగిన ఆధారమగువాడు
నేనన్న నా ఉనికికాధార మెటుకాడు?
కఠిన చిత్తము మాని ఉనికేల కననీడు?

ధరణి దారుల మకిలి మదిని జేరకముందె ,
ధారుణొసగిన గూడు చెదిరిపోవకముందె,
దామ్యులందెడి దారి దొరలించు ఈ గూడు ,
( దామ్యులు: అంతరింద్రియ నిగ్రహం కలిగిన వారు)
గురుతు గురువువు నీవే – వేరెవరు గతిగారె!!

సందేశము

వికసించిన కలువల కొలను పైనుంచి పోతున్న ఒక పిల్ల తెమ్మెరకూ –
అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న చంద్రుడిని ప్రేమగా చూస్తున్న కలువకూ
సంభాషణ జరిగితే … ఎలా ఉంటుంది …. ఒక ఊహ

నింగినెలే నిండు చందురుడేమి కబురులు పంపెనే!
కనులు తెలిపిన తీపి కబురులు – కొసరి కొంచెము తెలుపవే !!

తళుకు మినుకుల తారలద్దిన వలువ కట్టిన లలన సొగసుకు,
మోహమొందిన మనసు నడచిన బాటలో నే నడచినాడను !
ఎంత దూరమో తెలియనైతిని – బాట తరగదు మగువ దొరుకదు!
అలస టెన్నక మనసు నంటుక మరలలేకిటు ఒంటరైతిని !!

తేట కొలనున తెరపి కన్నులు తెరచినను తలచేటి కన్నుల,
సోయగంబును సొంతమొందెడి దారి ఎలానో దూరముంచితి !
దినదినంబును అనుదినంబును వాని బాసల నందుచు ,
దినకరుడు తా నందజేసిన వెండివెలుగుల సుధను పంచెద !

కొలను విడవు -కనులు ముయావు – తొల్లి తప్పును మరువ నీయవు!
మంతనాలను నిన్ను మనుపగ – చెంత చేరెడి తీరు తెలియదు !!
కొలను అలపై అల్లలాడుచు చెలిమి తెలిపెడి చలువ వెన్నెల ,
చేరి నీ దరి తెలుప నెంచదె నాదు యడదన భావనా !!

దూరమింతని ఎంచనెంచనీ వెండి వెన్నెల కిరణ కరములు,
తనువు తాపము తిర్చగా నా కనుల లోగిలి పొల్లజేయును
మధుర భావన నందజేసెడి సుధాకరునా కిరణ కరములు,
కొరత నెరుగవు మరలనెంచవు మాలిమిన నను లాలనెంచగ !!

కాల నాయకు కనుల వెలుగుగు కనుల కబురులు కుమ్మరించుచు
నాటి గోకులమందు గడిచిన గోపబాలుర గడుసు ఆటలు,
యమున అలలను ఆటవిడుపుగ ఆడి అలసిన గోపకాంతలు ,
అంది మురిసిన రాసలీలల వివరమెంతయె విశద పరచెను!!

అమరులైనను అందజాలని రాసలీలల వింత రచనలు,
అంగనంగన అంతరంబున అమరి ఆడిన విశ్వరూపుని ,
రూప వైభవ సోయగంబుల సరులు పొదిగిన సుధారసముల,
సారమంతయు రంగరించిన లలిత రాగములందజేసెను!!

అదితి దితుల లకు కంటివెలుగగు సంతు సందడి జేయుచు
చిలికి నారట నాడు కడలిని అమర పానము నందగా !
కడలి కెరటపు వెండి నురుగున మొలచెనట ఒక పుత్తడి,
అమర సీమల అందచందము అచ్చరొందుచు మొక్కగా!!

చక్కదనముల చక్కనమ్మను చేతులార గలంకరించుచు,
మురిసి ముచ్చట మునిగినారట అమర లలనలు అప్పుడు !
శ్రీహరికి తా సొంతమైనా సిరుల తల్లిని నుతుల పొగడుచు,
నాటి మంగళ మహావైభవ మహిమలెన్నో తెలిపెనే!!

అచ్చరలు గని అచ్ఛరొందెడి అంగ వైభవమొంది నాడట,
వాణి పలుకుల పొందికను తన వాణిలో అమరించాడట ,
కాలుడంటని వింత అరకును పొంద వైరమునొందువారాల
మహా పాశపు ఒడుపులొ ఒరిగించి పంచిన వైనమెంతో తెలిపెనే !!

పంచబాణుని మడియజేసిన మంచుకొండలు మహావీరుని,
అంబ సంగమమంది లాస్యము ననుదినంబును వీగు వానిని ,
మొహమందగ జేయగలిగిన మొహమాయా మహా శూరుని,
రూప వైభవ గంధముల నానందమొందగ తెలిపెనే!!

ప్రమథ గణముల నుతులనొందుచు అమర గానమునాలకించుచు ,
వివిధ వాద్యములంది దేవతలాలపించెడి రాగ జతులకు,
నృత్య రీతుల నమరజేసెడి భణితులను తా నభినయించుచు ,
హిమ నగంబున నటనమాడెడి హరి హృదంబును ఎరుకపచెను !

పాండు నందను రథముపై తా తేజరిల్లిన నందనందను
నవనవోజ్యల గురువు సఖుడును సారదైనా సాధు సంగుని
తలపె తామస తాడనంబని తలచి తారన జేయువానిని
తలపులందున తొలగనీయక తలపుమంచు హితవు తెలిపెను !!

మనసు మురిసెటి మధుర హితవును అంది సంతసమొంద నెంచుచు
కమల సంగుడు కడలి చీల్చుక ధరణి అంచుల తొగిచూసెను !
కనుల బాసల కరుగనీయక పదిలమెంచుచు కనులుమూసితి ,
కాల గణనలకందనట్టా అమర సీమల అవధి దాటితి !!

ఎరుక పరచిన ఊసులన్నీ యదన పదిలము చేసుకొని
నీవవని వాసుల వీనులందగ వల్లెవేయుచు వీచుమా !!

కామాక్షి కన్నులు

కామ జనకుని ఇంతి కొలువుండుఆ కనులు ,
కాలుడనవరతంబు వసియించు ఆ కనులు,
కాల కాలుని నడత శాసించు ఆ కనులు ,
కావవే నన్నెపుడు కొసరి కూరిమితో !!!

మొహమెరుగనివాని మొహాన ముంచగల
మొహ చంద్రిక వాక కమలాక్షి నీ కనులు!
మదను కాల్చినవాడు మురిసి నీ జటగట్టి ,
తనువులో సగమాయె – నీ కంట కోలువాయె !

తరుగెరుగా లేని తల్లి ప్రేమను కన్న
అమరాబ్ధి కాధారమగు నీదు కనుదోయి ,
కురిపించదా కొసరి కొంతైన ఆ మమత,
మాయ మడుగున మునిగి మరుగైన మాపైన !

పతిని బాసిన రతికి అభయంబు దయచేసి ‘
ధన్వంత్రి కలశమున పదిలపచిన అరకు,
నీ కనుల కురిపించి జీవింపజేసినా
అమర పానపు చినుకు మాయందు చిలుకవా!!

హరి సుతుండందినా నయన లేహ్యమునంద,
చిన్ని కోమరునివోలె షణ్ముఖుల కాలేము!
అమ్మలందరి అమ్మ అనురాగముల కొమ్మ ,
పాతకంబులుబాయ నీ ప్రేమ కురిపించు!!

రవి చంద్ర నయనాల జీవ రసములు కుడిపి,
జగమెల్ల లాలించి పోషించు మా జనని!
ఇహపరంబుల ఇడుము లీడేర్చగలయట్టి
సుధా రసముల జల్లు మాయందు కురిపించు !!

కటిక పాషాణంపు కుడుపు కుడిచెటివాడు ,
కని నిన్ను కుడుచునట సాధురస కుడుపులను!
ఉద్ధతంతము జేయు అట్టినీ చూడ్కులను,
చేదుకొని మాపైన చిలికించు ఓ జనని !!

కాలునిల్లాల నీ కడగంటి చూపులకు
సుధా సాగరమాయె నీ వాస పరిసరము!
దారి చేసుకు నీదు దరిని జేరగ లేము,
సారించి నీ చూపు మా దెసకు మరలించు !!

చింత దీర్చెడినీదు చలువ వీక్షణమంది ,
నీ నివాసపు శిలలు అమర రత్నములాయె !
ఆ చలువ కన్నుల చూపు చిలుకుమా మాపైన,
చెదరు చేతలు మాని నీ చెలిమి చిగురింప !!

ఆదరింపవే మమ్ము ఆనంద దాయిని
అదునుగాదిది యంచు ఆటవిడువకు మమ్ము,
అలసటెరుగని ఆట ఆడి అలసితిమమ్మ
అనురాగమున మమ్ము దరిని జేర్చుము నీవే!!

పగలైన రేయైన నడిమి సంధ్యలనైనా
ఆపు అలసట లేని నీ సుధా వీక్షణముల
తనియారగా తడిసి తరియించు భాగ్యంబు
కొండ కొనలకొసగి మమ్మేల మరచితివి!!

కమల కాసారముల మరపించు నీ కనుల
చిన్నారి చిరునవ్వు తారాడి మురియగా ,
మాయ ముసుగను తెలివి మాకేల కుడిపితివి!
మరపించి ఇకనైన మము మనుపు తల్లి!!

కమల కాసారముల మరపించు నీ కనుల
చిన్నారి చిరునవ్వు తారాడి మురియగా ,
మాయ ముసుగను తెలివి మాకేల కుడిపితివి!
మరపించి ఇకనైన మము మనుపు తల్లి!!

కామ జనకుని ఇంతి కొలువుండుఆ కనులు ,
కాలుడనవరతంబు వసియించు ఆ కనులు,
కాల కాలుని నడత శాసించు ఆ కనులు ,
కావవే నన్నెపుడు కొసరి కూరిమితో !!!

వీగిపోయెడి బంధాలు

వీగిపోయెడి బంధనాలకు విలువ నెన్నూట మానుమా ,
వీడనొల్లక వెంట నుండెడి వాని విలువను తెలుయుమా !!

మొదటి కుడుపును కుడిపినానని తల్లి నీ జత నుండునా?
తనువు కారణమైనవాడని తండ్రి విడువకనుండునా ?
చిగువు వయసున చెలిమి కుడిపిన తోడబుట్టినవారలు ,
బ్రతుకు బాటన సాగి ముందుకు నిన్ను మరువక యుందురా ?

వీగిపోయెడి బంధనాలకు విలువ నెన్నూట మానుమా ,
వీడనొల్లక వెంట నుండెడి వాని విలువను తెలుయుమా !!

వాదులాటలు చిన్ని ఆటలు నాడు చేసిన పెద్ద బాసలు,
బ్రతుకు బాటల నునుపు మెరుపున మరుగుగాకవి మిగులున్నా?
సాకులేమిటి దోసమేవరిది తెరపు మరపుల మూలమేమిటి ?
ఎరుగవలెనని నీవాసపడినా – ఎరుక తెలుపరు – మరలి చూడరు !!

వీగిపోయెడి బంధనాలకు విలువ నెన్నూట మానుమా ,
వీడనొల్లక వెంట నుండెడి వాని విలువను తెలుయుమా !!

చేయిపెట్టిన చెలిమి విలువను మిన్నయని నీవెంత ఎంచినా ,
పట్టినందుకు ఒరిగేనేమని కించపరుచక మిన్నకుందురా ?
గడియ గడియకు గిరులమించెటి విలువలేవో ఒరగలేదని ,
చెదరు చెలుముల వాదులాటల మాలిమెంతురనెంతువా ?

వీగిపోయెడి బంధనాలకు విలువ నెన్నూట మానుమా ,
వీడనొల్లక వెంట నుండెడి వాని విలువను తెలుయుమా !!

రుణములేవో తీరునంచు ఒడిన జేర్చిన విలువ నెన్నకు ,
సొంతమిది యని ఎంచి ఏమరపొంది ఎన్నడు తమకమొందకు !
సుధా రస కాసార కుడుపును వొల్లనా వసతేల కలిగిస్తివంచు ,
దిన దినంబును అనుదినంబును నీదు విలువను తెలుపరా !!

వీగిపోయెడి బంధనాలకు విలువ నెన్నూట మానుమా ,
వీడనొల్లక వెంట నుండెడి వాని విలువను తెలుయుమా !!

పుడమి నడచిన పుణ్య మూర్తులు విలువ ఎవరిది ఎన్నిన్నారని,
పురిటి మంచపు వాసనలలో పురుడు పోసిన విలువలేమని ,
పుడకలందున సమసి పోవుచు ఏమి విలువలు తెలిపినారని
పూని కొంచెము యోచనెంచుము వన్నెకెక్కిన విలువలేమని !!

వీగిపోయెడి బంధనాలకు విలువ నెన్నూట మానుమా ,
వీడనొల్లక వెంట నుండెడి వాని విలువను తెలుయుమా !!

తోడు

జన్మ జన్మల తోడు – జంటబాయకు నన్ను,
జతనీవే జగమందు – తనువున్న ! లేకున్నా!

కలనైన ఇలనైన కలిగుండు వాడొకడు,
కలిగించునట జగతి పలుమారు ప్రతిసారి!
పలుమారు కలిగించ పంతమేలో యంచు,
ఎరిగి ఎరిగించంగ ఎవ్వరెచటున్నారో !!
ఎరుగ నెంచగబోను – తగిలుండు నన్నెపుడు !!

నాదమై నీవుండ – తాను పలుకుల పలుకు,
వెలుగువై నీవుండ – చూచు లోకమునెల్ల ,
తోలుతిత్తీ తనువు తినలేదు మనలేదు,
తగిలి ఛాయలు నీవి తన సోయగమునెంచు,
తొలగి పోవకు నీవు – ఎడబాసి చనబోకు!!

ఒకనాడు గురువంటి- ఒకనాడు సఖుడంటి,
మరియెన్నడో నిన్ను మనువాడ రమ్మంటి,
ఒడిజేర్చి ఒకనాడు లాలించి సుతుడంటి ,
ఏమన్న ఏమైన ఏనాడు ఎపుడైనా –
తోడు నీవే నాకు – ఎడబాసి చనబోకు!!

తెరపు మరపుగ ఏవో లీలగా తోచేను
తోచు కారణమేదో తోచదే ఏనాడు,
చెలిమి కారణమేదో చెల్లిపోయినదేదో
ఏది కారణమైన – ఎవరు కారకులైన,
తోడు నీవే నాకు – తెరపైన మరుపైన!!

నాటి ఊహలు నేడు- నేటి ఊసులు రేపు,
ఏనాటికానాడు ఉనికి యై ఎరుకొందు ,
ఊసులల్లిన నాటి ఏమరపు భూతమై ,
ఊసు కళలను మాపు- ఊరడిల్లదు మనసు!!
మనసు మనుపగ నీవె- నను వీడి చనబోకు!

ఎన్నడో ఏనాడో ఏతరినో ఏదరినో
పట్టితివి నాచేయి – చెదరనీయకు సుమ్మి !
చెలిమి చేతన నీవు – తనువు తెలివిడి నీవు,
తగిలుండవలె నీవె – నా తెలివి తగదాయే ,
వల్లమాలిన మరపు పలుమారు ముంచినా ,
మారాము మరపించి – జత ఎన్నడును విడకు!!

జన్మ జన్మల తోడు – జంటబాయకు నన్ను,
జతనీవే జగమందు – తనువున్న ! లేకున్నా!

కైలాస వాసా

శివనారి కృపనొంది జీవమొందిన రేడు,
రెప్పపాటున తాను రెప్పమాటున జేరు!
అంతరంగపు అరన అమరున్న అమరుడా,
ఆదమరువక నన్ను ఆదుకుని ఏలుకో!!

మధుమాస మధురిమకు మనసెంత మురిసినా ,
మరుగు జేరినవాని ఉనికి మరువగ లేని,
వివరమెరుగగ జేసి – నీ ఉనికి నెరిగించి,
నెనరుంచి నన్నేల – అరమరెంచగ బోకు !!

అంతరంగపు అరన అమరున్న అమరుడా,
ఆదమరువక నన్ను ఆదుకుని ఏలుకో!!

తనువు తారణ తరికి సూత్రమైనా సుతుడు,
పండగా పున్నెములు ప్రభవించ వలెనంచు ,
మోహమొందెడి మనసు మధన కారణమణచ ,
కానికాలమనంచు కరుణ మానగబోకు !!

అంతరంగపు అరన అమరున్న అమరుడా,
ఆదమరువక నన్ను ఆదుకుని ఏలుకో!!

బహురూపముల నీవు భాసించగా నెంచ,
మనసెరిగి నీ మగువ రతిపతికి ఉనికిచ్చే!!
నీదు లీలల కేళి నిలువనీయదు మనసు,
మరుగు ఆటలనన్ను- మరలించ బోకు !!

అంతరంగపు అరన అమరున్న అమరుడా,
ఆదమరువక నన్ను ఆదుకుని ఏలుకో!!

చింత భారపు చెరిత గూటి గతులను మాపు,
మనుప నాకింకెవరు – గిరిబాల హృదివాస!
గూడు చెదరకమునుపే – గతులు మాయకమునుపే
అంతరంగపు అరను తెగనాడి ప్రభవించు !
పంతమాడగబోకు – పరుల వేడగబోను !
నేడైన రేపైనా ఏనాటికెపుడైన ఏలువాడవు నీవే !!
ఏమరక ఎడతెగక నన్నేలుకోవైయ్యా – కైలాస వాసా !!

భవదీయు బ్రోవవే !

లోచనంబుల మాటు ‘ఆలోచనవు’ నీవు,
ఆలోచనలు చూచు లోకంబులును నీవు!
లోకాల లోనున్న ‘కాల’ రూపుడ వీవు,
కనికరంబున కనగ కినుకేలనైయ్యా!

మాట మాటను మసలు నాదంబు నీవు,
నాదాన నర్తించు భావ మంజరి నీవు!
భావమందిన పలుకు మంజీరలయలందు,
లీలగా నర్తించు నటరాజు – నీవు!!

జిగిబిగిగ వడి వడిగ కదలు పదములనంటి,
కదిలి కరిగెడి కధలు అల్లునది నీవు!
అల్లికల బిగిలోన బిగిసి విలవిల లాడు,
వింత కధలను నీవే కడతేర్చరాద!

చేరి నిను సేవింప సంకల్పమును నీవు,
సంకల్పమును నడుపు చేతనవు నీవు,
చేతనందలి చెరిత చలనమును నీవే,
చేదుకొని చెరబాపి దరిజేర్చారాదా !!,

సాధు సంగా ! నేను “నేన”న్న వాడెవడు?
సావధానము నొంది సరకొంది వివరించు,
వివరమెరిగిక ముందు నేనెరిగినా ఉనికి ,
నీ ఉనికిలో కరుగు తరి తెలుపరాదా !!

ఏ భావములు పండి భావించితో నిన్ను!
భవతాప భయదూర దరిజేర్చుకో నన్ను!!
భవరోగా సంహార సరగుజేయుటమాని ,
భవ పాశముల నరికి భవదీయు బ్రోవవే !!!!!!