వినక తప్పదు

ఎవరి మొరలాలించి ఏమరలి యున్నవో !
దిక్కునీవే యన్న మనవి వినకున్నావు!
కాచినా కసిరినా నను కన్న దొరనీవు.
మాలిమెంచకయున్న మనుగడేదయ్యా !!

వాసవాదులు నిన్ను వీడకున్నారంచు
మునులు నీ పదములను పట్టియున్నారంచు,
పాల్కడలి పరమేశి సేవ సుఖములదేలి ,
పిన్నవాడగు నాదు పిలుపు నొల్లవదేల !!

వినత కొమరుని వంటి బలము కలిగిననేని,
కరుణింతువేమొ నిను వహిఇంపగాను !
వినత సోదరి పుతృ పోలికొందిననేని,
పరుపుగా నీ కరుణ కలిగుందునేమో !!

మొసలి బారిన పడిన గజరాజు గావగా ,
తరలు తొందరలోన తగిలియుంటివో ఏమో!
చిననాటి చెలికాని చేతి అటుకులరుచిన,
మురిసి మురిపెములోన మునిగుంటివేమో!!

నీ దివ్య లీలలను భావించి రమియించి
రచన జేసెడి భృత్యు భావ సంకలమంది
తగిన పంక్తుల పద్య పూరణంబును జేయ ,
చాటు మాటుగ మసల వేచియుంటివో ఏమో !!

రంగ రంగాయంచు సేవించు సతి వినతి ,
మన్ననెంచిన నీవు పతిసేవలో మునిగి,
ఆడవేషమునందు అతలకుతలంబగుచు,
కలి కంటకపు ముడిన మెదలకుంటివో ఏమో!!

కాలపాశమునుండి పసివాని కావగా,
కదలి తొందరనొంది తరలుచుంటివో ఏమో!
కటిక పాషాణంబు విలయ నర్తననాపి,
ప్రీతితో సేవింప ఉత్సహించితివేమో !!

కలి కాలి అందెలకు మౌనమందగజేయ ,
కాకాని కొలువులో కొలువుదీరితివేమో !!
కామితంబుల కొలిమి కొడిగట్టు అరకిచ్చి ,
ఆర్తి ఖేదములణచ తొందరొన్దితివేమో!!

ఏమేమి జేసినా – ఎవని కొరకేగినా,
కొరత తగదయ నీకు నా మొరలువినగా!!
కాచినా కసిరినా నను కన్న దొరనీవు.
మాలిమెంచకయున్న మనుగడేదయ్యా !!

Leave a comment