చూపులో నీరూపు నిలచిపోయేదాక – నిలుపనీ నా చూపు నీ మోముపైన ,
మోమాటమే లేక పలుమారు పారాడి – మోము ప్రతి వంపులను వహియించుదాకా!
వలదన్న వినదాయె కనురెప్ప నిలదాయె – పలుమారు నీ మోము మాటుజేసేను ,
రెప్పపాటెరుగనా పద్మసంభవుడేలా – నా కంటి రెప్పలకు ఈ పాటు నొసగే!!
కలి కలతలో మునిగి కడతేరు తరిలేక – కలతపడు నీవారి కనికావగా నీవు ,
రెప్ప మొప్పలు లేని నిండు నయనములంది – కొలువుదీరితివయ్య నీలాద్రిపైన !
నినుగాన నాకున్న నయనాల కేలనో కడుభారమగు రెప్ప లమరించినావు!!
నయనాల సగపాలు రెప్ప చాటునమరిగే – సగపాలులో సగము రెప్పపాటున మరిగే!!
కనగలుగు కన్నులను కలిగున్న ఫలమేమి – కలిగించు నీ మోము కనలేని నాడు,
చూపువై నా కనుల కదలునీ జాడలకు – జడ భావనల నేల జతజేయ వలయు ?
చూపు చెదరగజేయు చింత చింతనమాని – నిలువనీ నా చూపు నీ మోముపైన,
మరలుటెరుట మరచి మరులుగొని నీ మోము నిలుపనీ కనులందు చూపుండుదాకా !!
కమనీయమగు కరుణ నొలికించు నీ కనులు – కరిగించవే నాదు మాయ మమకారంబు,
మాయ నర్తన లయల లయియించు ఈ జగతి – తగిలుండవలెనన్న నాదు మోహంబు!!
తోడబుట్టినవారు తోడైనవారు -తనుబంధముల వలన తగిలుండువారు
తలపులో తలతురని తలపోయవలెననెడి – తడబాటు నెడబాపి తెరపీయరాదా!!
కదిలాడు ప్రతి నీడ – నీ ఛాయేయగుగాక – చూపాను ప్రతిచోట నీ రూపే నిలుగాక !!
రెప్పలానిన కనులు లోచూపులో మునిగి – మాలిమిన నీ రూపు మలచి చూచునుగాక !!
చూచేటి ప్రతి కనుల చూపులో నీరూపు – నిలకడగ నాకనులు కనగలుగుగాక !
మతియందు మితిలేక మసలు యోచనలన్ని కరిగి నీరూపుగా రూపొందుగాక !!