శరణు

దండించగా నీకు దశ భుజములున్నా 

శరణు వేడగ నాకు నీ చరణమే దిక్కు,

మాయ మోహమునందు జన్మ జన్మల నుండి 

ఒదిగున్న తప్పులను ఎన్నగా బోకు!

                     తనువు జేసిన తప్పు తనువుతో బోదాయె,

                     మనసు జేసిన తప్పు మరలినా బోదాయె,

                     తప్పులేనీ జగము నీవల్ల కూడితే,

                     ఎందుకిందలి వాడు తప్పుజేస్తున్నాడు?

మోహమందిన నీవు లోకముల నెరిపావు,

అందెన్నొ సంగతులు ముదముగా నుంచావు,

మహనీయుడ వీవు మాన్యుడవు నీవు,

మోహమెందుకు నీకు మోదమొందించె?

                     దూషణకు భూషణకు భేదమే లేదంచు,

                     మనవలయు నని మమ్ము శాశించు నీవు,

                     శృతులు నేటికి పంపి స్తుతియింప నేర్పావు?

                     నిర్గుణత్వము కిందు తావెట్లు గలదు?

మానావ మానములు ఎంచగల శక్తిచ్చి,

ఎంచకుండుటె మెరుగు – ఎంచలోపమనంచు,

నీ కల్పనల నీవె లోపముల నెంచేవు,

పెద్దరిక మది నీది – ప్రేలాపనలు నావి!

                      నేనెంత వాడనని నా తప్పు లెన్నేవు?

                      నీ సాటివాడనే నేనాటికీ గాను!

                      ఏలికవు నీవంచు ఎలుగెత్తి చాటేను,

                      జాలి గొని దరి జేర్చ వేడుచున్నాను!

జ్ఞానమెరుగని వాడ- ధ్యానమెరుగని వాడ,

ప్రతి అణువులో నీవు మాటేసి యుంటివట,

సరసనున్నావంచు తెలియ నెరుగని వాడ,

సాయూద్య మందించు శేషాద్రి వాసా!

Leave a comment