అమర ప్రేమికుడన్న నీ పేరు నిల్పుకో!

అతి మధుర మధువు గని గ్రోలేటి మధుపమై

నీసఖుల నెడబాయనో దివ్యమూర్తీ!

సంగతంబెరుగనీ గురిలేని మనసులను

ఏల ఏలగలేవు గొల్ల లేలినవాడ!

నీ సొగసు గనలేని అన్నమయ్యను జేరి

పలు విధంబుల వాని నొప్పించి ఒప్పించి

దరిని జేర్చినవాడ దయకు వారాసీ!

ఏల నా సుతులందు సద్దుజై లేవు?

చల్ది ముద్దల కొరకు పలు బడితలోర్చి

పడుచు భామల మదిన మదనునిద్రుంచి

బృందావనంబందు భక్తియే రక్తి యని

రసికతకు రూపమౌ ఓ మధుర మూర్తీ!

రావేల నా సుతుల సంగతము జేర?

చిన నాటి చెలికాని బాధ బాపగ నెంచి,

కవ్వించి నవ్వించి అలసటను మరిపించి

పురము వరకూబిలిచి పలు సేవలందించి

ప్రేమారగా అటుకులందినో విభుడా!

నా సుతుల నేనాడు చేరగా బిల్చేవు?

మేనత్త కొడుకంచు వరుస గల్పుక నీవు

నరుని రధసారధ్యమును నేర్పుగా జేసేవు

రవి చంద్రులను బిలిచి కాలమును మార్చేవు

కాలునిన్ముందంపి ధర్మమును గాచేవు

నా సుతుల జేరుటకు సమయమే గనలేవా?

కలి కారుమబ్బులకు-ముసిరేటి మోహముకు

పలు యక్షులేలేటి నాసుతుల మనసులను

వెఱ్ఱి ఊహల వేట ఏల ఆడించేవు?

అమరమౌ నీ ఊహ వారి మనముల నాటి

అమర ప్రేమికుడన్న నీ పేరు నిల్పుకో!

Leave a comment