దామోదరా

కార్తీక మాసంలో కృష్ణభగవానుణ్ణి ‘దామోదరుడి’గా స్మరించాలని శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి ప్రవచనంలో విని…

భూభారము హరియింపగ – పాపడవై పుడమి మొలిచి,

ఎదుగుచు ఆడిన ఆటలు – మురిపెంబులు గావె మదికి – మోహనరూపా!
హరి హరి యని పదుగురాడ – హరియింపగ గోకులమున,

మెండుగ దొరికిన వెన్నను – ఎక్కువగా హరియించుట – వేడుకగాదే!

 

లాలించెడి మురిపెంబును – మోదింపగ మదిన దలచి,

భావంబులు పలికెడి నీ – కనుదోయికి భయము నద్ది,

ముప్పిరిగొను ముదిమిని ఆ – యదు కాంతకు ఒసగినావు – యాదవబాలా!

 

మూపురమున మంధరగిరి – ఓపిన తరి నేనాడూ,

ఒరియని నీ ఒదలు నేడు – చిక్కపు త్రాటికి చిక్కగ,

ఒరిపిడితో నలిగి నలిగి – గురుతులు మోసెను తనువున- తామస హరణా!

 

నిక్కంబిది నినుదలవగ – నందున కానంద మేమొ – నళిన దళాక్షా!

తులసీ మాలల తోరణ మమరికగా అద్ది నీకు సేవలు జేతున్!

 

ఓరిమిగొని నాతప్పులు కూరిమితో కనికరించు,

కండలు కరుగంగ పూజ చేయగ లేదని తొలగకు,

సారము ఉడిగిన తనువిది-బేరము లెందుకు మనలో,

రయమున నా సంతు ఇడుము లీడ్పగ రారా!

Leave a comment