నీలకంఠా

shiva

కూరిమిగొని కూర్మముగా హరి నెరపెడి కార్యంబున

ఉరుముచు పొంగిన భీతికి భీభత్సము ముప్పిరిగొనె!

హరహర యని సురలసురులు ప్రాణార్తిన పరుగిడుతూ,

వైకుంఠుని విడనాడిక వేడితిరే శరణూ!

భరత శాస్త్రపు గతుల పదనర్తనలతో,

ప్రమధ గణములు కూర్చు వాద్యఘోషలతో,

వాగ్దేవి వివరించు స్వర సరంబులతో,

నందీశు విభుడచట విభవంబు నమరే!

సర్వమంగళ అమరు వామ భాగము గల్గి,

శశి శేఖరుని శిఖన పూవుగా గల్గీ,

సుర గంగ చిందేటి జటాజూటము గల్గి,

శోభించు శంకరుడు కరుణ గని జూసే!

పొంగు హాలాహలము అమల మట నీకు,

ముక్కంటి వేలుపా వేగ పడుమయ్యా,

పద్మాసనుని ప్రతిభ ముప్పు జిక్కెను నేడు,

ఆరగింపుము ‘దాని’ నాదుకొను మమ్ము!

ధవళ కాంతులు దేలు దేహమమరిన వాడు,

నల్ల నాగుల నగలు అమరున్నవాడు,

హరహరాయని నంత హరించు వాడు,

వల్లె యని తన సభను వీడి అరుదెంచె!

లయకారుడగు పతిని రక్షకుగ జూచీ,

లాలిత్య మమరించె భీభత్సమందూ!

జగదంబ ఆనగొని బీతి భీతిల్లి,

వశమాయె వరదునకు జగము లెరుగంగా!

దామోదరుని సాటి గురుతు లమరంగా,

మృతము గూర్చెడి సురభి కంఠ మమరేను!

వాత్సల్య మొలికించు ఫాలక్షు మనమునకు,

కేతువై కలకాల మమరమై వెలుగా!

ప్రమధ నాధుని ప్రణుతి పలుకు వారెల్లా,

పార్వతీ పతి పదము గొలుచు వారెల్లా,

శంభు సౌందర్యమును పొగడువారెల్లా,

నీలకంఠుడ అంచు నుతియింప రాదే!

సీమలెరుగని కరుణ కలిగున్న వాడు,

విధివిధానపు పూజ లెంచ నేర్వని వాడు,

విన నెంచరాదె నా విన్నపములెల్లా,

నా  తనూభవు   బ్రోవ తరలి రారాదా!       

Leave a comment