గూడు కూలిన చిలుక – గగనానికెగిరింది,
గమ్యమెరుగని దారి పయమై తరలింది|
చెదిరి పోయిన గూడు – చెలరేగు సుడిగాలి,
గుండెలవిసే ఘోర మేఘ గర్జనలు,
తెరపెరుంగక కురియు చినుకు సందడులు,
ముగిసి మౌనమునొందె మందహాసముతో||
వెలుగు కిరణమువెంట వేటకై పయనించి,
తరువు తరువును అడిగి ఎంచి తెచ్చిన ఫలము,
గూటిలో వేచున్న గున్న మెచ్చకపోతె,
వగచి పొంగిన కన్ను నేడింక నిదురించె||
చిగురు రెక్కల కూన గూడు విడిచిన రోజు,
చూపుకాపును పరచి తోడు నడచినరోజు,
చిన్నబోయిన చిరుత చింతజెందిన రోజు,
గతితప్పి నాగుండె నెమ్మదించెను నేడు||
గూడుకూలిన చిలుక! గగనానికెగిరేవు,
గమ్యమెరుగని దారి పయనమై తరలేవు|
రెక్కలాడని పరుగు పలుమారు లెగిరినా,
సావధానమునొంది సందేశమందు||
అవధులెరుగని శాంతి శాసనంబగు సీమ,
రేపు నిన్నను రోజు లెరుక లేనీ సీమ,
ఆనందమని తలచి ఆదమరుతువొ ఏమొ,
మరుపు మాపెటి మాయ మరుగెరుగ దచట!
జారిపోయిన గూటి జాడయగు భావములు,
తరలిపోయిన కధల కష్ఠాలు కడగండ్లు,
తెరపి తెలిపిన తెలివి ఎంచి నేర్చిన పలుకు,
కలబోసి వడబోసి కొత్త పుంతల జూపు||
జాగరూకతనొందు – జాణతనమును వీడు,
ఎన్నికలు ఎంపికలు ఎరుగనని ఎరిగించు,
పలుమారు అమరినా చెదిరిపోయెడిగూడు,
ఒల్లనని ఒదగనని పంతమాడుచు పలుకు||
రూపమెరుగని వాడు – బహురూపి వాడు,
పాలించి లాలించి మన్నించువాడు,
ఎడబాటు తగదన్న తగిలుండువాడు,
తోడుబొందిక నీవు తామసము వీడు||
గూడు కూలిన చిలుక – గురుతెరిగి ఎగురు,
గమ్య మొకటే నీకు – సాధించ నెగురు||