తనువు చెల్లెడి వేళ అలకనందా సుతుడు – పలునామములు కూర్చి మాలజేసి,
తరియింప తలపోసి జనులెల్ల ఎరుగంగ – పూర్ణావతారునకు పూజ నొసగె!
సురగంగ ఒడిలోన పండు ముత్తెపు మెరుపు – నెలవంక వొలికించు సుధారస సారములు,
ఉదయ భానుని చేవ – నవ ఋతువు చేతనము – తీసికట్టగు మాల -నామ మాలా!
వశిన్యాదులు గొల్వ జగతెరింగిన తల్లి -కచ్ఛపికి సరిగమలు పలుక నేర్పిన తల్లి,
పరమేశు కొలువగా రూపమందిన తల్లి-కామేశ్వరిగ జగము నేలు తల్లి,
కొలిచి కోరగ హరుడు మన్నించి పలికెనట – మధువు పండగ తల్లి వీనులందు!
అంది ఆ నామమును – పరిజనులు ఋషి మునులు – లెక్క మించిన దిశల చాటినారు!
హరి నామమేగాని ఇతరమొల్లని మౌని – కరకు బోయనుగావ తిరగేసి తెలిపినా,
నామ మాధుర్యమున మునకేసి నా బోయ – శ్రీపతిని భువిదాక తరల జేసె!
రామ రామా యనుచు రావణుడు తరియించె – తరియించె నడివిలో గండ శిలలు,
తలపోసి తపియించి శబరి తా తరియించె – కనక మృగముగ మడియు అసురు గూడా!
త్యాగయ్య కీర్తనకు, గోపయ్య పదములకు, కలియుగంబున పలికి గాచినాడు!
నరులు వానరులన్న తారతమ్యములేక – అందగలిగిన సరళ నామ మిదియే!
రామన్న రాకున్న చిన్నతనమే లేదు – రామ బంటచటనే తగిలియుండు,
నామ పానపు మోహ మవధి చెల్లగ జేసి – కైలాస కోమలిని కోరి బిలుచు!
అట్టి నామము నేడె మదినెంచి పలుకరే – పరమ పథమున మేను తరలునటుల!!