నింగి నేలెడి పూర్ణచంద్రుడు – కలువ జేరితె కొంచెమా?
గాలి అల్లరి నదుపు జేయుచు –కడలి నిలిచితె కొంచెమా?
అద్దమున తా నిమిడియుంటే – కొండ కేమది కొంచెమా?
కొండ కోనల కనులు మూసుక తొలగియుండుట కొంచెమా?
బీజమందును ముడుచుకుంటే –వట శాఖలకు అది కొంచెమా?
అదుపెరుంగని గాలి – చిరు తనువు దూరుట కొంచెమా?
పసుపు ముద్దను పార్వతంటే – పరమేశు పత్నికి కొంచెమా?
మాధవుడు గోపాలుడైతే – మద్ధుకైట హారికి కొంచెమా?
జీవి జీవికి తోడు నిలచితే – ధరణి కేమది కొంచెమా?
దోర పండిన పండు బరువుకు – కొమ్మ వంగుట కొంచెమా?
నీటి చుక్కల భారమోర్వక – మబ్బు వంగితె కొంచెమా?
తీరు తెన్నులు తెలియకుండుటె – మాయ జగమున కొంచెమా?
అలవి నొల్లని ఘోరదుఃఖము – మదిన నిల్పుటె కొంచెమా?
ఏలు వానికి మోదమొసగగ – నెమ్మదించుట కొంచెమా?
గడుసు సమయపు కాటులో నీ కరుణ జూచుట కొంచెమా?
పగలు రేయని పొరలు కాలపు జడిన ఒదుగుట కొంచెమా?
వెల్లువంటిది నీదు కరుణని ఎంచి చాటుటె కొంచెమా?
అడుగు అడుగున ఆదరింపగ ఉంటివనుటే కొంచెమా?
భావ భవనపు భోగమును విడి – కనికరించుగ నెంచవా?
కొల్లయేయగు గాని నీకది కొంచెమెందుల కగునయా?