కోదండమందినా కోమలాకారుడా-తూణీరమున అన్ని అమ్ములేలా?
నా అహము నణచేటి అమ్మొకటి సంధింప ఆలసింపకు తండ్రి వేగమొందు!
తనువు రాలిన నాడు తగిలినా తరుగనీ వన్నె నేడే దృంచి ఆదరించు!
వన్నె లన్నిటి వన్నె ఆవరించిన పదము శరణమని ఎంచగల వసతినిమ్ము!
తిరుగు టెరుగని శరము తీరుగా సంధించి అసుర సంతతి నేల అణనచినావు?
పలుమారు ధరణిపై నీపాద మూనుటకు కారణంబగు వారు అధములెటులా?
అంత సందడిజేయ శక్తి లేదయ నాకు – నీరసించితి నేను బ్రతుకు బాట!
నడచి చేరెద వనుచు నానుడొందిన వాడ-నా వంక నడువగా జాలమేలా?
నీ పాద పూజకై రాగమందిన శబరి – ఎంచి తెచ్చిన పూల పున్నేమేమో!
నీ రుచిన జేరగల రేగిపండును పొంద – పొంగి పొరలిన గుబురు భాగ్యమేమో!
అలనాటి నీ గురుతూ మోయుచూ తిరిగేటి – చిరు ఉడుత బ్రతుకెంత ఉధరాయె!
పలుమారు నీ పూజ మరి మరీ జేయంగ మందగించితి నంచు మరలబోకు!
దండకారణ్య మది ఏ పూజ జేసెనో – నీ వసతి గాగలిగె వనిత తోడు!
కటిక నేలన నడచి కందు పదముల సేవ- ఎంతగా జేసెనో నాడు ధరణి!
అట్టి భాగ్యము నొందు యోగ్యతొందగ నాకు-తపియింప తగినంత అలవి లేదు,
సోమరిని నేనంచు వేరుంచబోకయా- సాకనాకింకెవరు నీవు గాక!