నేనెన్నడెరుగనే నా భాగ్యమీరీతి – మదన జనకుని రూపు గాంచునంచు,
బ్రహ్మాండముల ఉనికి శాసించు దేవుండు – నరుని ఆనతి నొంద వేచెనేడు!
మురళి పైనాడేటి చిగురంగులిక మిపుడు కరకు కళ్ళెపు త్రాడు పట్టెనెటులో,
ఆలమందమల తోన ఆటలాడే విభుడు చెండకోలను బట్టి నిలచె నేడు!
భక్తసులభుడటంచు వినియుంటినేగాని – కన్నులారగ నేడె గాంచుచుంటి,
తోడుగోరిన వాని తోడుండి ఈతీరు – జయము నందెడివరకు నడపు వాని!
చెలువారగా చెలులు సవరింప నొల్లనా ముంగురుల నేడెవరు ఆపగలరు?
తనివితీరగ కదిలి కస్తూరి కరుగగా ఫాలభాగంమంత ముద్దులాడె!
నగుమోము గనకున్న నాభాగ్యమేమందు – శంతనుని దీవెనలు చెల్లుగాదె!
దోషమేదో జేయ కలిగెనీతనువన్నవగపు నేటితొ తీరి తరలు గాదె!
వాస వాసమునందు వసియించు వాసుండు – వాసుదేవుడు వాడె వెడలెనేడు,
వన్నెతరుగని విందు కనులార కనియంగ – కడసారి కనువిందు కొనుడనంచు!
అస్త్రంబు పట్టనని కొంటె పలుకులు పలుక – నమ్మి నెమ్మదినొందె వెర్రివారు,
అరవింద నేత్రునికి అస్త్రశస్త్రములేల – ఉనికి గాచెడివాని ఉనికి తగదే!
అసురులణచగ తొల్లి అందినా రూపములు – నీ మోహమేరీతి మరువగలవు?
మోహమెరుగని నీవు మోహనాయని పిలువ – మోదాన మదిజేరి మనుపుగాదా!
మీనంబులో నున్న చపల చాంచెల్యంబు – కూర్మంబు కలిగించు కుదురు గుణము,
నారసింహము లోని అమిత ఆవేశంబు – వరహావతారమున పొంగు కరుణ,
వామనుని లో స్పూర్తి – పరశురాముని యుక్తి – సుగుణ భూషణుడైన రాము రూపు,
వాసిగా నిను జేరి వాసిపెంచిన రూపు – పూర్ణరూపము నీకు సంతరించె!
శిఖిపింఛమీనాడు శశిరేఖ యైవెలిగి – కాలరూపుని ఉనికి ఒలకబోసె,
లీలగా నీ లీల ఎరిగియూ ఎరుగకే – ఆయాసమొందరే సేనలన్నీ!
శ్రీవత్సమీనాడు మాటుగా ఒదిగుండి – నెమ్మదింపుమనంచు వేడునేమో!
దైత్యమర్దను రాణి దండనీతుల దొంతి – దరహాసమున వన్నె పెంచునేమో!
మురిపెంబుతో వసుధ వందనంబులు జేసి – వొడలంత గంధంబు అలదినట్లు,
ధూళి గప్పిన తనువు ఫాలక్షు మరిపించు – హరిచందనముకింత సొగసుగలదె!
పీతాంబరుముపైన మొలనూలు దట్టించి – లోనున్న భువనముల భద్రపరచి,
గడుసు దనుజులతోన క్రీడింప నురికేవు – దుడుకు లీలల ఉనికి ఎవరికెరుక!
శరఘాతముల నోర్చి ఉప్పొంగు తనువుతో – శ్రమనొందు ఈశునికి తోడుగాక,
ఆనతొందగ లేని ఆవేశమణగింప – చక్రాదులే పగిది మదన బడునో!
పట్టినా ముట్టినా – పేరొకటి తలచినా – మోక్షపథమును కట్టబెట్టువాడు,
పనిగట్టుకుని నేడు ఎల్లరెరిగెడి రీతి- తరలిరండని నిలచి పిలచుచుండ
మోహమొందిన మాయా ముందుగా తరలదే- ఎడబాటు తనకింక తగదనంచు!
గోకులంబున నీవు ఆడించినా ఆట – చవిచూచు భాగ్యంపు కరువునాకు,
దినదినంబును నిన్ను మదినెంచుటేగాని – పంతమాడెడి ఊహ ఎపుడులేదు,
నేడందినీ తెఱపి నాభాగ్యమని ఎంచి – విదితముగ నా విద్య ఎరుకచేతు!
పరశువందిన నీవు నాకు నేర్పిన విద్య – చెల్లునే నీ చెలుని వింటివడికి!
ఎదనున్న నీ ఉనికి ఎదటి రూపును మించి నన్నుగావగ ఉరికి విదితమగునో!
దుడుకు శిష్యని దృంచ నీలోని నా గురువు – శరమంది విదితమై కరుణగనునో!
చెల్లించు నాపూజ శరమంది ఈ నాడు చేవగలదేని నా యురమునందు,
వేడుకొందక యుంటె ఏటికీ తనువింక – వసుధపై నేనేల మసలుచుంటి!
నమ్మియుండెడివారి నగుబాటు గావంగ – నగుబాటుగాగలుగు గొల్లవాడా!
నేడు పార్ధని పాటు ఏరీతినోర్తువో – కన్నులారగ నేనె గాంచుగాదె!