కల్పవల్లీ

కామజనకుని ఇంతి కినుకేలనమ్మా ?- కరుణ జూడగ నాకు గతిఎవ్వరమ్మా?
కారణంబేమన్న కబురు లేకున్నా – మనసు విచలత నణచ అలవిగాకుంది!

అరవిందముల సేవ అందించగాలేను – అగరుచందన గంధ మీయలేను,
పన్నీటి చినుకులను కొసరి కురిపించుచూ- నామ మాలల నేను నుడువలేను!
పసుపు పారాణితో శోభించు నీ పాద మంజీరముల ఉలుకు వినగ లేను!
కర్పూరవీటికా సమ్మోహ గంధమును శ్వాస దారుల నేను ఎంచ లేను!
మతిమాలినీ మనసు మునుగు గంధపు ఘోష మాపి ఏలుము తల్లి! మా కల్పవల్లీ!

మంచి జాజుల మాల మరువంబు జత జేసి తీరుగా అల్లి నే నొసగ లేను,
మందారు గన్నేరు ఎఱ్ఱమంకెన పూలు ఏరి ఎంపిక జేసి కూర్చ లేను,
ముద్దబంతులు చెండు చెంగావి చీరెపై సరిగంచు తోడుగా నుంచలేను,
మొగలి రేకులు ముడిచి కంఠహారపు శోభ ఇనుమడించే ఇరువు నాకులేదు!
సెగలు రగిలే మనసు సేదదీర్చుము తల్లి – సాదరంబున ఏల దరినిజేర్చి!

ఎంచి కుంకుమ పువ్వు ఏలకులు జతజేసి పాయసాన్నపు కలశముంచలేను,
భక్ష్యభోజ్యము లేహ్యచోష్యాదు లన్గూర్చి నైవేద్య సేవనే జేయలేను,
వీనులారగ నీకు వీణాది వాద్యముల తోడుగా నేపాడి మనుపలేను,
వట్టివేరుల కట్ట పరచి కట్టిన యట్టి వింజామరల బట్ఘి విసుర లేను,
విసిగి విరిగిన మనసు వివరమేమెరుగదే- వసతి నొందెడి దారినెరుజేయి!

నికడెరుగక నీల్గు మనసు మనుపు మటంచు విన్నవించెడి తీరు నెరుకజేసి,
మందగించిన మతికి మనసు మనిపెడి మేధ ఆదరముతో నొసగి ఆదరించి,
మందాకిని వంటి నీ చూపు పంజరము పలుదిశల నాకొరకె పరచి యుంచి,
ఎడ దారి పెడ దారి ఏ దారి నడచినా నీ గూటిగురిలోనె నన్ను నడిపి,
ఆదరించుము తల్లి ఆదుకోవమ్మా – మనసు దారులనుండి మరలించవమ్మా!

Leave a comment