ఛాయ!

నల్లమబ్బులనాడు వెండి వెన్నెల వెలుగు – చినుకు చినుకుగ జారి మరులు గొల్పు!!
మనసు మూలల నుండి మదన జనకుని ఊహ – ఉల్లాసముగ పొంగి ఉరము నింపు!
నీలి మేఘపు ఛాయ శశిమౌళి శిఖ ఛాయ – శ్యామలాంగుని మేని మెరపు ఛాయ,
మాతంగి మనసార మెచ్చి అందిన ఛాయ – మమ్మేలు శివ పత్ని మేని ఛాయ!!
భాను తాపము నుండి తెరపినిచ్చే ఛాయ – భావ నగముల నగవు నందు ఛాయ!
ఉడుకు శిఖి ఊహలకు ఊపిరూదే ఛాయ – తెరపి నొల్లని మనసు మరగు ఛాయ!
రూపు గట్టిన మాయ నంటి నడిచెడి ఛాయ – వెలుగు గలిగిన యంత మలగు ఛాయ,
చూచాయిగా దెలుపు సూచనందిన చాలు – వెండి వెన్నెల పొంగు మనసు నిండు!
నగుబాటు అనందరే అందరూ ఈ ఛాయ – వెలుగు తొలగిన మిగులు వెలితి ఛాయ,
అలసటొందిన నాడు ఆదరంబున జేర్చి – అలుపు బాపెడి మమత నెలవు ఛాయ!
ఏ పొదల మాటునో రాధికా జడబట్టి – పంతమాడే గడుసు గొల్లకాపరి ఛాయ ,
ఆ ఛాయ నా ఛాయ ఛాయయై వెన్నంటి- పాండు నందను సాటి నన్ను జేసే!
ఎంత మోహము తండ్రి గురుతొందగా నాకు – నెలకొంటివీ జగతి జాడలందు,
పగలంత నీడయై వెన్నంటి నడిచేవు – పొద్దుగుంకిన నీవు నింగంత నిండేవు!
నేరమెన్నకు తండ్రి జాడెరుగగాలేక – మరుగేల విడవంచు మాటలంటి,
మందభాగ్యునికైన – మహరాజ సుతుకైన – ఛాయ నీదే తోడు ఎరుగమైతి!
ఆనాటికానాడు తరిగిపోయే తనువు – మాధవుని తోడన్న ఊహనొంది,
మోదాన మునుగదే ప్రతి మానవుని మనసు – మనుప ఇంతకు మించి మురిపెమేది?

Leave a comment