చిటికెడటుకులు తిన్న ఋణము తీర్చిన వాడ
ఒక్క మెతుకును మెక్కి తృప్తి నొందిన వాడ
జాడ తెలియని వెన్న వైనముగ సాధించి
చిలిపి ఆటల సఖుల ఆర్తి తీర్చినవాడ!
అడుగు దానముబట్టి బలిని బ్రోచినవాడ
శబరి ఎంగిలి కొరకు అడవి నడచినవాడ
సోదరులు సుర గోరి సాగరము మధియింప
కారుణ్యమూర్తివై గిరిని మోసినవాడ!
మితిలేని జలరాసి నిమడలే నా తనువు
ఒక రాతి స్తంభమున ఇంపుగా నింపేవు
జంగమయ్యను బ్రోవ నంది మేళము గట్టి
పరమ భక్తుని యురము చీల్చి చంపేవు!
గజరాజు గాచుటకు ఖగమునెక్కనివాడ
ధర్మమును నెరపుటకు అస్త్రమూననివాడ
సురను గావగ నీవు మోహినై మురిసేవు
గరళ పానముజేసి ప్రహ్లాదు గాచేవు!
తల్లిప్రేమను దృంచి నరకు జంపిన వాడ
గాంధారి కన్నీటి కాహుతయ్యిన వాడ
భక్తికై బహుళముగ పరితపించెడి వాడ
జ్ఞాన చీనాంబరము నమరి మసిలెడి వాడ!
చిన్ని నా విన్నపము మోహమని ఎంచేవు
నియతి నియమ మనెంచి మిన్నకుండేవు
ఏలువాడవు నీవు ఏలికను నేను
ఏమరక నా మనవి నాలించి మన్నించు..
దరిలేని కాన న న మలిగేటి నా సుతుల
మరలించి మరపించి మక్కువన ఏలుకో!
నీ దివ్య సంగమున సఖులుగా జేసికో
వారి హృది సీమలన స్థావరము నెరపుకో!