గరుడవాహన యంచు గగనమున వెదికేను,
వృషభవాగన యంచు వనులెల్ల వెదికేను,
కమలాభవుడవంచు కొలనులను వెదికేను,
కనరార వేగమే కనికరము మీరగా!
సింహ వాహినియైన హిమతనయ యైనా,
హంస వాహినియైన వాగ్దేవియైనా,
మకర వాహినియైన క్షీరాబ్ధి కన్యైన,
ప్రేమ మీరగ నా మొరను వినరాదా!
ఎలుక నెక్కిన వాడు, ఏనుగెక్కిన వాడు,
అందమగు నెమలిపై విహరించువాడు,,
ఏల వినలేరు నా విన్నపపు పిలుపు?
మాయసంకెళ్ళ లో నలిగేటి అరుపు!
జగతిలో ఎందెందు ఏజీవి తలచినా,
వేగ జనుటకుగాద వల్లభుని వరము?
అధికారులు మీరు- అధములము మేము,
ఆదుకొమ్మని మిమ్ము వేడుచున్నాము!
పాడిగాదిది మీకు – మిన్నకుండగ రాదు,
బ్రతుకు బాటల యందు ఇక్కట్లపాలైన,
నా సుతుల దయజూచి-మోదాన దరిజేరి,
మీదివ్య లీలలన – వారి బ్రోవగవలెను!