వనమాల

వైజయంతిని బోలు వనమాల నమరింప,

కొమ్మకొమ్మను అడిగి దళములేరితినయ్య,

పూల కూర్పును పేర్చ దారమేదీ లేక,

యోచనగ నిలచితిని సందేశమందగా!

పూల తేరుల లోన తుమ్మెదలు తగిలాయి,

మధువు గ్రోలక ఏవొ మంతనాలాడాయి!

ఊసు తెలుపుమటంచు మన్నించి అడుగగా,

తమ మాటగా తెలుప సందేశమన్నాయి!

లేత మొగ్గల బుగ్గ పొంగి విరిసిన తీరు,

పీయూషముల పుంత పోంగి పొరలినతీరు,

సుర సౌరభపు సాటి మేటినా తీరంచు,

మరుల దేలుచు మురియు నవల తీరు!

లోకాల భరింయించు ఉదరంపు సందడులు,

సుతిమెత్తగానాడు నాభి పురముకు  పైన,

సర్వజీవుల జీవనాడియౌ సర్వేశు,

హంస గమనపు శ్వాస మసలు చోట,

సిరి సాటి  నిలువగల తులసి దళముల వెంట,

శ్రీవత్స మమరున్న వక్ష సీమను జేర,

ఎన్నికైనా విరలు ఎంచవే ఎల్ల లను,

యవ్వనంబుల పుంత నందజేయంగా!

కూరిమే కూర్పుగా కూర్చి చేర్చమనంచు,

కనుసన్న తో పలుకు- లల్లి పలికాయి!

వరుస వరుసన అమరు వన్నెవైనములన్ని,

సరసముగు వాసనల సరులు తెలిపాయి!

వైజయంతిని వీడి వనమాల ధరియింప,

వసుధ జేరిన వాడ – వాసుదేవా!

వన్నె తరుగక ముందే మన్నించి ఏలరా,

వసివాడునేమొ ఈ పురపు విరులు!                                                                                                                                                      వరదుడవు నీ తోడు వరదాయినుండగా!

మాధవుడవట నీవు రాధ తోడు!

వసుమతిని చేపట్ట శ్రీరామడైనావు!

నేటికే రూపమున బ్రోతువయ్యా?

వారి వీరిని అడిగి ఎరుక గొంటిని గాని,

ఎరుగనే నీ రూపు తీరు తెన్ను!

మరుగు మాపుక నీవె ఎరుకగా దరిజేరు,

ఏలికవు నీవన్న ఎరుక గరుపు!

Leave a comment