విద్య

 

కడుపు కుడుపుకు కొలువు నిచ్చెడి – చదువు చదువగ తగినదా?

తనువు తగిలిన తరిని తెలియగ – తగిన విద్యలు తగినవా?

రాలి తగిలెడి తనువు నిలుపగ తగిన చదువులు చదివినా,

కొలువు కొలుపును తగిలి యుండుటె చదువుకర్ధము గూర్చునా?

అర్ధమందిన అమరుసుఖములు అమర పధమును తెలుపునా?

తనువు సారము ఉడుగు వరకూ అర్ధసాధనే సాధనా?

అర్ధమొల్లక కుడుపు గడువదు- కుడుపు నొల్లక తనువు నిలువదు,

తనువు చెల్లిన తరిని ఎరుగగ తారకంబగు ఓడ మిగులదు!

తనువు నిలుపను సారమంతా అర్ధసాధన కుడిగితే,

తనువు కారణ విద్య దెలియగ తరుణమెన్నడు గలుగును?

సంచితంబాగామి తక్కెడ మిగులు అంశపు చెల్లుబాటుకు,

తగిన విద్యను తెలియుటె ఈ తనువు తగిలిన కారణంబట!

కుడుపు చదువుల సాధనందే తనువు వన్నెలు తరిగిపోతే,

జీవజాలపు ముఖ్య కాలమా విద్య సేవలో చెల్లిపోవును!

వివిధ విద్యల విజిత రూపము వెల్లడించున దేమనీ?

వన్నె   తరిగెడి తనువు వన్నెను తగిలి యుండుట ఏటికీ?

తనువు తాపము తీరు విద్యలు-తెలియు తరి ఇక ఎన్నడో!

సారముడిగిన నాడు ఈ తనువాసుడందున ఆ తరిన్?

Leave a comment