విధి కలంబున జాలువారెడి వింత కధలివి – విందువా?
విగత మనముల జీవరాసుల బాధ గాధలు – విందువా?
వాణి ఎరుగని పదములల్లిన వింత కూర్పును విందువా?
వీనులున్నవి వినుటకేగద విన్నవించు మనందువా?
వ్యాధిబాధలు – వ్యధల విసురులు – చెదరు యోచన పుంతలూ,
కరుగు కాలపు కఠిన ఒరవడి తొలగి నిలచిన చరితలూ,
మన్నికైనవి మనుగడున్నవి మనసు మూలల నున్నవి,
హరిహరాదుల కదలజేసిన వైరి సంతతి ఊహలూ!
మనసు నడిచెడి దారిలో తా నడువ నొల్లని తనువులూ,
తనువు తాపపు తాకిడొల్లని నియమ వరుసల పేరులూ,
నియతి నియమము నెరుగజేసెడి తాళపత్రపు తునకలూ,
తాళలేమని తల్లడిల్లెడి మాయలోకపు మనుషులూ!
కలుష వర్తన ఫలము భోజ్యము -తరుగు దారిదె ఎరుగవే,
ఖేదమేలని ఊరడించెడి మునిగణంబుల హితవులూ,
మన్నికైనది మనసుకందక కలుగు చింతల చిందులూ,
కరుగు కాలపుహోరులో తా కరుగ నేర్వని ఊటలూ!
ఏది విందువు ఏది కందువు – కాలమెరుగని నాయకా!
ఏవగింపులు – ఆదరంబులు – ఎరుగ నొల్లని భావుకా!
ఏలికగు ఆ పరంధాముడు ఎంచి ఇచ్చిన నాటికా! (నాటికా – గ్రంధవిశేషము)
నడుపుటెరుగని బడుగు బొమ్మల దడుపు కధలను విందువా!