గంగ పుట్టిన తావు నుండి తరలి వచ్చిన భావుకా!
తెలిపుమా మీ సీమలో మా సాటి వారల కుశలము!
ఉరుము కిరణపు భాస్కరునితో పంతమాడగ జాలకా,
కమిలి జాలిగ జూచునేమో ఆదుకొనగా వేడుచూ!
తరలి పోయే వెండి మబ్బులు మరలి ఎన్నడు వచ్చునో!
ధరణి దాహము బాపి ఎన్నడు సేదతీర్చగ నెంచునో!
పొంగిపోవకు పిచ్చి బాలా – అంత తొందర దేనికో!
పొంగులారెడి పరువమంతా పరచి పండుగ జేతువే!
కన్నులారగ నిన్ను మెచ్చెటి కన్నులెన్నడు గంటివో! కనికరంబున ఒక్కరైనా మెచ్చుకోలుగ గంటిరా!
నునుపు చెక్కిలి వాడకుండగ వెన్నమీగడ లిత్తురే!
పొటమరించెడి నీదు నగవును ఎన్నడైనా కందురా!
వన్నెతరుగక నిలచియుండగ మంచి అత్తరు నిత్తురే!
వేడుకగ నీ మనసు నిండుగ మన్ననెపుడైనిత్తురా?
ఎచటనుండిటు వస్తివో – ఏమి జూడగ వస్తివో!
మదనతాపము మాపుకొనుటే మేటి బాటనుకొంటివో!
తనువు కర్ధము అర్ధమేనని వగచు తనువుల తోపులో,
మలిగిపోయెడి నీదు పుట్టుక వ్యర్ధమే యనిఎంచవో!
వేకువైనా చీకటైనా వేచి పూచెడి పూవులూ,
తరికి యొక్కటి తరలి జేరును కామజనకుని సేవకు!
నింగి అరుణిమ చిన్నబోయే మందార గుత్తుల మోదమూ,
ముందుగా నన్నందుకొమ్మను వెన్నముద్దల గుత్తులు!
చిగురు చెక్కిలి సిగ్గు మొలకన పలుకరించే పూవులూ!
చనువుగా తా మమరుగాదా పూజ పూజన మేటిగా!
పూవులెకే పూజ చెల్లదు – పలుకడే ఆ సరసుడు!
పూవులున్నవి పూజకేగద పుణికి పూజల సేయరే!
వాని యోగము వీసమైనా వాసిగా నీకొరుగునా?
వేలకొలుపులు వేచియుందురు వారి పొందును పొందగా!
మన్ననొందగ మొలచెనే ఆ విరులు భారత మందునా!
వాని కుశలము కుశలమే మరి మీకు కుశలంబెక్కడా?
అంతమోదము నొందునా ఆ పుడమి మొలచిన పువ్వులు!
ఎంతలో నే నెంత తరుగని ఎరక జేస్తివి భావుకా!
ఎగిరి నేనెటు బోదునో ఆ అమర ధామపు అనరుకు!
నేటికెరిగితి నీటిమూటగు బ్రతుకు పండెడి మార్గము!
గగన దారుల నడచి పోయే సర్వసాక్షుని సాక్షిగా,
వెండివెన్నెల కుమ్మరించే నిండు చంద్రుని సాక్షిగా,
వసతిగా న యదన కదిలే గాలితరగ సాక్షిగా,
వేడుకొందును లోకనాధుని నన్ను ఆ దరి జేర్చగా!