సలిల కేశమువాడు – నిప్పు కన్నుల వాడు
నిక్కముగ కిసలయపు – జంట బాయని వాడు,
తామసుల తపములను – కరుణ గాంచెడి వాడు
వాసుదేవుని స్మరణ – మరువ నేర్వని వాడు! ! శంకరా!
మధువనుల మారుగా – మరుభూమి నెంచుకొని,
తరలిపోయెడి వారి – తోడు నిలచెడి వాడు,
భూషణంబులు హరికి – బూడిదే తనదంచు,
కాష్ఠశేషమునందు – శయనించు వాడు! !శంకరా!
యడబాయలేనంచు – దరిజేరు జవ్వనికి
మణులు మాణిక్యములు – మందిరము లీక,
దేహియని చైజాచి – భిక్ష నడిగాడు,
తనదైన దేహమును – పంచి ఇచ్చాడు! !శంకరా!
విశ్వేశు ధ్యానమున – మై మరచు వాడు,
విశ్వ కార్యమునందు – మోదించు వాడు,
నిస్సంగులకు తాను – సాంగత్య మందించి,
మోదమున నగముపై – నర్తించు వాడు! !శంకరా!
మోహమెరుగని వాడు – ముక్కోపి వాడు,
సరస మెరుగని వాడు – సన్యాసి వాడు,
మదును జంపినవాడు – నిర్మోహి వాడు,
ప్రియురాలి నెడబాసి – తపియించి నాడు! !శంకరా!
ప్రమధ గణముల యందు – కరుణ గలవాడు,
చైతన్యమై జగము – వ్యాపించు వాడు,
నారాయణునాజ్ఞ గోని – నడయాడు వాడు,
పార్వతీసుతు శిరము – ఛేదించినాడు! !శంకరా!
కాలకూటపు ఛాయ – జీవరాసుల వ్రేల్చ,
దాక్షిణ్యమును దాల్చి – దక్షిణా మూర్తియై,
యజుర్వేదము నిచ్చి – యజ్ఞముల నిచ్చి,
మాధవుని మహిమలకు – వన్నె నిచ్చాడు! !శంకరా!
మంత్రమెరుగని వాని – తంత్రమెరుగని వాని,
పూజ లెరుగని వాని – పుణ్య హీనుడ గూడ,
ఎరుక లేనొక క్రతువు – పూజగా తలపోసి,
దరిని జేర్చెడు వాడు – వెఱ్ఱి శంకరుడు! !శంకరా!
రూప లావణ్యమును మోహించనారూపు,
ఛాయగా నామదిని స్పృశియించెనేమో!
పలుక నేర్వని మనసు – పలు పల్కులన్పేర్చి,
పరమేశు పదఘటన భావించు చుంది! !శంకరా!
ఏమరక ఏపూజ – నేజేయగా లేను,
మోహబంధము నుండి – మరలగా లేను,
నా మానసంబంచు – నా పలుకు లంచు,
అహమునందెడి నన్ను – ఏలుకోవయ్యా! !శంకరా!