సారధి

లోకనాధుడు గోపబాలుగ తరలి ధరణిని జేరినా,
కన్నులారగ వాని గాంచెటి భూరి భాగ్యము కలుగునా?
తరుగు భాగ్యపు తనువు బొందిన నరులు వేదన నొందరే!
తరలి మాధవు తనివిదీరగ కనులు పండగ చూడగా!
గోకులంబును వీడి జనినా మోహనాంగుని కొలువులో,
చేరి కొలిచెటి భాగ్యవంతుల వరుస సరసన నిలువగా,
పూర్వపున్యపు పుంత తరుగని వగచు జీవులు ఆశతో,
విజయు చెలునిగ వన్నెకెక్కిన వల్లభునికై జూడరే!
సూర్యచంద్రులు అంది నడిచెడి శాసనంబుల పలుకుచూ,
లేగలై తన వెంటనడచెడి పరిజనంబుల గాచుచూ,
ధరణి వైరుల ఎదన వైరపు అనరు మాపగ నెంచుచూ,
అలసటెరుగక కదులు కన్నుల కానగా తామెంచరే!
సరిజోడుగా ఆడంగ తామా నందసంతున నమరరే,
వాని శరమును నోచదగు వైరంబునైనను నోచరే!
పొందునొందగ పాండునందను అనుజులైనా కారుగా!
ఎదురు నిలబడి వాని చందము జూచు భాగ్యము గోరగా!
కురువంశ సంతతి చింత నొందుట మోదమేగా జనులకూ,
పోరు సలిపెడి సేనలందున నిలచు భాగ్యమునొందినా,
శౌరి గాంచెడి మధుర తెఱపిని అందు నెమ్మది నొందుగా,
వైరి సేనల వరుస నిలచుట మంద భాగ్యము గాదుగా!
ఏమి భాగ్యము ఏమి భాగ్యము గాంగేయు సరసన నిలువగా!
తొల్లిజేసిన పున్యఫలములు పొంగి పండుగ జేయుగా!
సవ్యసాచికి ఎదురు నిలచిన జన్మ సఫలంబాయెగా!
ఫాలనేత్రుని మనోహారిని గాంచగలిగిరి సూటిగా!
అష్టగుణముల మూలధాతువు లంది మారకమందగా,
పుణ్యభూమిని ఎన్నినాడా ధరణినాధుడు నాటగా,
మెచ్చి వరముల నిచ్చినా మహనీయు ప్రేమను మెచ్చరే,
నేటికీ నరులంత పొందగ ముక్తి పధమును సులువుగా!
కురుక్షేత్రపు సీమ పొర్లగ నిలచి యున్నా సేనలో ,
ఎరిగి ఎరుగక నిలచినా దివిలోక వాసము కర్హులే,
కటిక వాడని కరుణ తరుగని తల్లడిల్లుట మానరే!
నాటి వరముల కోటలో తామసువు బాయగ నెంచరే!
భక్తసులభుడు తానుగా రధసారధా యెను నరునికి,
సారమగు తన సంతునెల్లను సురధామ వాసుల జేయగా!
పాంచజన్యము బట్టిగూడా యోచనెందుకు దేవరా!
చెలికాని వింటికి ఆజ్ఞనొసగుము శరము రయమున విడువగా!
అంతలో ఏమాయె సామి క్రీడి రధమును వీడెనే!
శరణు నీవని పదములంటుచు పదము లేవో పల్కెనే!
వాని వాసము నిక్కమే మరి మా గతేమని ఎంచవే!
మందభాగ్యల గావగా నీ మహిమ జూపర దేవరా!
కినుక గంటివొ పలుక కుంటివొ వైరిభావన గొంటివో,
బావయోయను భావమున నీవాటలాడచు నుంటివో,
దుయను వేడుచు క్రీడి వాలెను నీదు చరణపు సీమన!
జాగుజేయక ఇచ్చగింపుము మమ్ములందర బ్రోవగా!
తీరియున్నవి సేనలన్నీ నీదు ఆజ్ఞను బొందగా,
మాటకందని మధుర భావము మనసు మూలల ఇంకగా,
మాధవా మమ్మేలుమంచు మరుల మడుగున మునుగుచూ,
గతులు మరచిన కాలగతులను నీల్గు చేష్టల జూచుచూ!
వాదులేలయ వల్లభా ఇది హితవు దెలిపెడి తరుణమా?
వేచియుంటిమి ఎంతగానో విజయు శరముల నందగా!
వెన్న ముద్దలు వేడబోమయ రధము పూన్చుము హయమునా!
కపికేతనుండటు ఖిన్నతొందుట నీదు శోభను పెంచునా?
వంగి కళ్ళెము బట్టకున్నది వరద హస్తమదేలనో,
అమరేంద్ర తనయుని శస్త్రమేలొ మౌనయోగము బూనెనే!
విఘ్నమెరుగని పద్మనాభుకు అడ్ధగింతలు అమరునా!
ధ్వజము నందలి రామభక్తుడు జూచి మోదము నొందునా!
నిక్కమే నీ మోముగాంచిన చక్కపడుగద యోగము,
చెదరు ఊహలు నెమ్మదించుచు తిరిగి జేరును పాదును,
కన్నులారగ కరవు దీరగ జూచు భాగ్యము నిస్తివా!
సమ్మతెరుగక చెదరు మనసును నెమ్మదింపగ జేతువా!
కినుక కారణ మేదిగాని రణము వీడకు గిరిధరా!
శరణు వేడిన చెల్లజేయక ఫల్గునల్లరి జేతువా!
భీభత్సు కన్నుల పొంగెనే కురువృధు జననీ ఛాయలూ!
నాడు ద్రౌపతి గాచినాడవు నేడు పార్థుని విడుతువా!
ఇంత కఠినత నెచట నేర్చితి వింకనైనా ఒప్పవా!
ఓరిమొందగ మా మనంబులు చెల్లె ఒప్పుల సీమలూ!
ధర్మనందను ననుజుడే నీ దయకు నోచడదదెందుకూ!
ఇందుకేనా సారధైతివి బంధుజనులకు ప్రీతితో!
మాయధారుల ద్రుంచగా నీ వవతరస్తి వనందురే!
పాండునందను లోపమేమని కినుక గంటివి ఈతరి!
నేటి భాగ్యపు ఛాయలే మా నిండు భాగ్యమనెంతుమా?
ధర్మరక్షణ దారిలో మా అసువు బాయకె యుందుమా?
ద్రుపదు పుత్రిని గెలిచి తెచ్చిన దుడుకు వీరుడు ఈతడే!
ఖాండవంబును గాల్చనీజత అంమ్ము నందిన దీతడే!
కిరాతకు మదమణచి శస్త్రము గొన్న క్షత్రియు డీతడే!
వియ్యమొందగ నీవు మెచ్చిన వీరపుత్రుండీతడే!
నాటి ఒప్పుల కుప్పలో ఏ లోటు నీకిట తోచెనో!
కుంతి పూజల ఫలములో ఏ పొల్లు నీమది గుచ్చెనో!
సావకాశము నేడె నిండెన తప్పు ఒప్పుల నెన్నగా!
తప్పుగాయగ నీవుగాకింకెవరు పాపము పార్థుకూ!
చల్లముంతలు చెల్లజేసిన గొల్ల మనసేమాయరా!
చెలుని చల్లగ గావగా ఏ చిలిపి అల్లరి అడ్డెరా!
చతురులాపుము చేరదీయుము చిత్తగింపుము దేవరా!
తరుణ మింకను మించకుండా శంఖమూదుము శేఖరా!
ఏమి అంటివొ ఏమి వింటివో మొలచె చంద్రిక మోముపై,
అభయహస్తము అందెనదిగో ములుకోలు మోహముదీరగా!
అస్త్రమందిన అర్జునుండదె భీభత్సరూపిగ నిలచెనే!
తారకంబగు తరుణ మిదియే రెప్పవాల్చక జూడరే!
పాంచజన్యము నంది శ్రీహరి నిండుగా పూరించెనే!

పంచప్రాణములున్నపాటున బొంది వీడగ నెంచెనే!

మోహమేదో పట్టినిలుపగ కన్నులింకను నిండవే!
పీతవస్త్రుని పాదములకై వ్యర్థ శోధన జేసెనే!
హయము రేపెటి ధూళిలో నే గానకుంటిని చక్రిని!
అమ్ములవిగో కురియుచున్నవి అందరే మీరందరూ!
ఆదివ్యాధికి అరకు ఇదియే అంది తారకమొందరే!
హరునిగా హరియించు శ్రీహరి చరణ సన్నిధి జేరరే!

Leave a comment