నిశ్శబ్ద శబ్దం

వీనులెరుగని ఆలకింపుకు – విన్నపంబిదె వేడెదా,

పవను పల్లకి మెట్టి మెదలని-పలుకు నేనెటు పలికెదా?

భావ భవనపు బీజమందున-మెదలు వీచిక మొలకలో,

అంకురించిన అందమేదో – వాణి మన్నన నందదా?

ఆదిగా అమరున్న నాదము – లయల నేర్వగ కోరదా?

నగకన్య నాధుని ఆశ్రయించుక – నర్తనంబుల నేర్వదా?

అట్టి నర్తన అలజడైతే – అందు స్పందన బుట్టదా?

జగతి మూలంబైన స్పందన-చేరు వారిని కోరదా?

శంభుపద మంజీరనాదము – పలుకులైనవి ధాతలో,

వేదమై భువినేలు చున్నవి – నాటనుండవి మేటిగా!

వేదమల్లిన మాలలే – అమరేను ఆ హరి ఉరముపై,

సిరికి తెలియని చిద్విలాసపు ఉనికి తెలిపగ తీరుగా!

ఆదినాదనము పొందగలిగిన అవధి పరిధిని చెరుపగా,

చేరదే ఒక నాద బీజము నాదు మనసును మనపగా!

మురిపెమొందెడి మధుర భావపు సవ్వడుల నే పంచగా,

ఎంచనే ఒక నాద రూపము నాదు పెదవుల దాటగా!

వీనులెరుగని ఆలకింపుకు – విన్నపంబిదె వేడెదా,

పవను పల్లకి మెట్టి మెదలని-పలుకు నేనెటు పలికెదా?

Leave a comment