అంతులే నాకశపు రంగు ‘నీలా’ గుంది,
దాని బింబము చూపు నీరు ‘నీలా’ గుంది,
అనుదినము వానితో నడయాడునా మేను,
నీ గురుతుగా ఆ రంగు ‘నీల’ మంది!
మణులు మాణిక్యములు రాసులగ నిలిచాయి,
వేయి వేల్పుల కొలుపు కోరి పిలువగ తరలి,
ఉనికి తెలుపుట కొరకు తమ రంగు నెంచగా,
సభతీరియున్న ఆ దేవతల తలచాయి!
వాగీశ్వరిని మెచ్చి ఛాయపొందిన రాశి వజ్రమాయె,
సిరుల తల్లని జూచి మోహించినా రాశి పుష్యరాగమాయె,
దురిత దూరిణి దుర్గ రంగునందిన రాశి కెంపులాయె,
నీపాద సేవలో తరియింపగా నెంచి సామీప్యమందితే ‘నీల’ మాయె!
శశిమౌళి కలిగున్న – శర్వాణి తోడున్న,
నీఛాయ గురుతొంద తపియించి తపియించి,
తలచినదె తడవుగా క్షీర మధనపు తావు,
తరలి మృతమును మిృంగి ‘నీల’కంఠుడాయె!
జగము నేలెడివారు – జగము నమరినవారు,
నీ గురుతు మోయచూ మురియగా గనుచుంటి,
మధురమగు నీ ఛాయ నెలవొందు తావొకటి,
దయమీరగా నాదు దరి జేయరాదా!