కూరిమితో కుచేలునకు కలిమి బలిమి నిచ్చినోడ
ప్రేమ కోరకు తులసి ఎత్తు తుాగిన ఓ తుంటరోడ
గోపెమ్మల కోక లెల్ల కొల్లగొట్టి ఒట్టుబెట్టి
గోప్యమైన జ్ఞానమిచ్చి వారందర బ్రోచినోడ!
యుగయగంబులు వేచి బహుఇడుములోర్చీ
కలికాలమున నీవు కల్పించు పధమందు
శీఘ్రముగ వైతరణి దాటగానెంచీ
వింత వింతగు దోవనెన్నుకున్నొక జీవి
కలియుగపు కలవరము కంటకంబై తోచి
జన్మకర్ధము తెలియ తడవుగానగలేక
తృణప్రాయపు తనువు చేజార్చునో ఏమొ
నా తనయుడని గాదు – మోహ బంధముగాదు,
సాటి జీవికి సేవ యనినిన్ను వేడితి
వింత వాదము మాని- నా సుతుని మది నిండు
విశ్వవ్యాపివినీవు- విశ్వైకనాధుడవు
విజ్ఞానమును నీవె – విజ్ఞతయు నీవె
వేయేల వేదముల కాధారమీవె
నా సుతుని బ్రతుకులో పూర్ణత్వమును నింపు
నీ సఖునిగా వాని సంగతంబును బెంచు,
నీ చరణముల ఘటన వాని చరితగ మలచు
నీ ప్రేమ లాలనను వాని కందించు
వాని వాక్కున నీవు పలుకువై పులకించు
వాని వీనుల నీవు నిత్యవాసమునుండు
వాని కనుపాపలో చూపువై నిండుండు
సర్వమున నిండున్న సర్వేశ్వరుడవీవు
వాని చిరుదేహమును విడనాడి మనబోకు..
నీ ప్రేమ లాలనను వాని కందించు