హిమనగంబులపైన – ఉరికేటి నదిపైన,
పంటపైరులపైన – ఎండుటాకుల పైన,
పురిటి పాపడిపైన – విగత జీవుల పైన,
అచ్చటని ఇచ్చటని ఎంపికే లేనట్టు,
కిరణ కరములు చాచి స్పృశియించువాడు,
నేర్చెనట ‘నిష్కామ యోగ’ ప్రకిృయను,
భగవానుడిచ్చెనట అతనికా యొగం!
యుగయుగంబుల నుండి ఓర్పుగా నేర్చి,
పంచభుతములందు ‘తేజ’మై ఒప్పు!
నగమైన నరుడైన – నగర వాసములైన,
పొంగు సాగరమైన – కృంగు లోయైనా,
జంతువులు, వృక్షములు, మరుభూములైనా,
తన యదన పదిలముగ నిలుపుకొను ధాత్రి,
‘నిష్కామ యోగ’మును బడసి సాధించీ,
పంచభూతములందు ‘పృధ్వి’యై ఒప్పు!
విష్ణు పాదము బుట్టి శివుని శిరమున మెట్టి,
చినుకు చినుకుగ నడచి- పసిడి పంటల నిచ్చి,
తరువులకు, తరుణులకు, వన చరంబులకు,
దాహాద్రి తీర్చుచూ సాగేటి సలిలములు,
‘నిష్కామ యోగ’మును ఎటు లెరుగునోగాని,
పంచభూతములందు ‘జలము’యై ఒప్పు!
మురికి వాడల లోన – పూల తోటల లోన,
ప్రేమ ఊపిరి లోన – పాము బుసలోన,
చిట్టెలుక యదనుండు మృగరాజు వరకు,
ప్రతిజీవి శ్వాసగా అనుదినము సాగి,
‘నిష్కమ యోగ’మును లెస్సగా సాధించి,
పంచభుతములందు ‘వాయు’వై జేరె!
అంతరిక్షపు వింత రాజ్యమందంతా,
తారతారకు నడుమ అంతరంబంతా,
జీవులస్థిక లందు – హృద్సీమ లందు,
నభోవీధుల నుండి – చిరుకణము వరకు,
తనయందె నిలుపుకొని – తన ఉనికి తెలుపకే,
‘నిష్కామ యోగ’మును తన ఉనికిలో నిలిపి,
పంచభూతములందు ‘ఆకశం’ బాయె!
ఇట్టి తన సృష్టి గని -మురిసె నా బ్రహ్మ!
ఏమి సౌందర్యమిది – ఏమి సౌఖ్యంబు?
మూల ధాతువులన్ని మోదముగ నమరె!
వైకుంఠు సేవలో దిన దినము మోదించి,
జగతి చందములందు చరియించు వారకై,
వేదములు వెదెకెనా – కమలా భవుండు!
ఈ పంచ ధాతువుల కుదురుగా కూర్చి,
ప్రతిదాని కింతంచు భాగములు ఎంచి,
చైతన్యమును చిలికి తన మేధ జేర్చీ,
జీవ జాలమునెల్ల నెలకొల్పినాడు,
తన సృష్టి అందాలు తనకె తెలియంగ,
ఆ బొమ్మలోతాను అమరి యున్నడు!
ఆవింత పొంతనల పోకడల మహిమో!
అందు నిండున్న ఆ దివ్యాత్మ మహిమో!
పంచభూతములన్ని తమ సాధనల మరచి,
‘నేన’న్న అహములో మోదమొందుచు నుండె!
పాడిగాదిది నీకు పాల్కడలి శయనా!
పాలింపగా రార – పవన సుత వంద్యా!