నే శరణన్న పదము

నారాయుణురముపై నడయాడు పదము,

గౌరీశు శిరముపై నర్తించు పదము,

అసురత్వమును బాప ముందు నడచిన పదము,

పరమ పావనమైన శ్రీ శక్తి పదము – నే శరణన్న పదము!

కఠిన శిలలో కరుణ నింపగల పదము,

ధరణీశు దానఫల మీయగల పదము,

తపియించు ప్రేమకై నర్తించు పదము,

శ్రీదేవి కరములందొదిగుండు పదము-  నే శరణన్న పదము!

దినదినము పలు పూజ లందుకొను పదము

మునిజనుల మానసము విడలేని పదము,

పదము పదమున కదలు కనరాని పదము,

సారధై నాసుతుల నడపించు పదము – నే శరణన్న పదము!

Leave a comment