గురుతు ఎరుగగ జేయి గురుదేవ నేడు,
కాల గతులందు నీ పదము కదలికను!
వెరపు మాపుము సామి కరుణతో నేడు,
కాల విన్యాసముల బడలియున్నాను!
తిమిర తెరలన నలుగు నగర వీధులలోన,
గురుతు తెలియని జ్యోతి జాడ వెదికేను,
విద్యగానీ విద్య సమసి – నీ విద్య నే,
ఎన్నడెరుగుదు తండ్రి తెలుపు తొందరగా!
అంతరంగపు ధ్వనులు అదుపెరుగకున్నాయి,
నాడు నేడని లేక లంకె లెరుగని తరిన,
వింత సంధానముల కూర్పులను పేర్చుతూ,
నెమ్మదెరుగగ పారు ఝరణివలె యున్నాయి!
సుడిగుండముల సుడులు సుందరంబన్నాయి,
కొండ కోనలదారి కమనీయ మన్నాయి,
తనువు తాళగలేని తీక్షణపు శరములను,
మంత్రించి సంధింప తా సిద్దమన్నాయి!
సర్వ వ్యాపకుడైన సర్వేశు వీనులకు,
నీర సించిన నాదు స్వరము చేరగలేదు,
సర్వాంతరంగుడగు ఆర్త వత్సలు కన్ను,
అంగలార్చెటి నాదు యద ఘోష కనలేదు!
జ్ఞానజ్యోతుల జీవ మందిచగల వాడ!
జారచోరుని జాడ తెలుపగల వాడా!
పట్టుమా నా చేయి పదిలమున ఒడుపుగా,
పరమేశు పురమునకు నే తరలు దాకా!