భవ భువన భవనాన భీతి గొనియున్నాను,
భవ మూల పునికి నే కనలేక యున్నాను,
ముజ్జగుంబుల ధాత దయనెంచి ఉదయించు,
ఉనికెరిగి నేనిన్ను గురుతెరుగు నటులా!
గురు భావనల గురుతు గగన కుసుమంబాయె,
అహము నను అదిలించి అదుపుగొని మనిపేను,
అన్యమెరుగగ నాకు తెరపి తరుణము నీక,
అహము మించిన గురువు అవనిపై లేదంది!
అంతమెరుగని ఆది అగునీవె ఆనాడు,
మోహమొందేలనో అహమునొందిన ఫలము,
బీజ జాలము జల్లి మొలిపించెనీ జగతి,
మోదమమరగ ‘నీకు’, ‘నేను’ నిలిచాను!
తోడు మరువని నీవు తోడేల విడిచెదవు?
తోడుంటివను తెలివి మరుగేల జేసేవు?
తనువు తోరణతొవ తరుగు తరి నెరుగగా,
తోచకున్నది దారి- దయనెంచి ఎరిగించు!
కాలకాలుడ వీవు కాలాంతకుడ వీవు,
కాల నాగుల నగలు కోరి నిను జేరేను,
కాల వాహిని జోరు ఓపలేనీ మేను,
ఏల దూరితివయ్య ఎరిగింపుమిక నాకు!
నిను వీడిమనలేక వెంటాడి నడచితిని,
మేను దూరిని ‘నేను’, ‘నీ’ జాడ మరచితిని,
మరపు తెరపుల ఆట అలసటాయెను ఇంక,
మరపు మాపుము నీవె మరుగు విడచి!
నీవాడు ఆటలకు మోదించి మాతంగి,
బీజ బీజము నందు చేతనై వెలుగొంది,
వేల రూపములాయె క్రీడింప కామమున,
మోదించు మోహానా! నా మరపు తొలగించు!
క్రీడ రూపము నీది క్రీడించు కనకాంగి,
కారణంబుల రూప మేల నలుగును జగతి?
‘నీవు’ జూపక ‘నేను’ ఎరుగ గలనా గతులు?
గతి లేని గమనమున గతి నెరపి పాలించు!
జర చరించెడి నెలవు ఏలువాడివి నీవు,
ముదిమి కుడిపెడి జనుల మొరలెరుంగు!
చిద్విలాసపు చినుకు చింతామణుల నెలవు,
చేరి మురిసే మాత కృపను కుడుపు!
క్రీగంటి చూపుతో నెలవు నేలే తల్లి,
తరుణ వీక్షణ భాగ్య మనుపు మంచు,
ముద్దార ఎరిగించు మోదమొందెడి వేళ,
రసము రాజిల్లెండు గళము వాడా! –
హలుడు నెరపెడి నర్తన నుభవించెడివాడ,
చంద్రహాసుగ చెలిని చెలిమి జేసెడి వాడ,
చెల్లునయ్యానీకు హలుని హరియింపగా,
సాటివారల గాము సారంగ విభుడా!