దున్న నెక్కినవాడు దూరాన గలడంచు – కునికి పాటేలనే మనసా?
ఆ సామి రాకడకు రెప్పపాటే చాలు – ఏమరపు మానవే మనసా!
తరలిపోయేనాడు వెంటరానీ తనవు – మురిపెములనెంచకే మనసా!
సాటివారలమంచు సాకులెన్నెడివారి – సావాసమును విడుము మనసా!
వెంటనడవుమటంచు నడచేటి మహనీయు – మాన్యతను ఎరుగుమో మనసా!
భీకరంబైనట్టి జగతి నీడలజూచి – భీతిగొని మడియకే మనసా!
ఆదరంబగు నీడ అద్దమందున జూసి – మోహమొందకు వెఱ్ఱి మనాసా!
అద్దరుండెడి వాని ఆధారమగు వాని -పోలికల పోల్చుకొను మనసా!
పలికేటి ప్రతిమాట నాదముగ నాదించు – నారాయణుని గనుము మనసా!
నాదమున కాధారమగు వాని నెరుగగా- మౌనమును మనువాడు మానసా!
కోనేటి నీటి పై ఊయలూగే అలల – అలరింపు నందకే మనసా!
అలకు ఆధారమై నెమ్మదించెడి మడుగు- నిలకడను నేర్వవే మనసా!
గహనమగు గగనాన తళుకు తారల జూచి – తమకమును మానవే మనసా!
తళుకుతారల దండ ధరియించు గగనంపు- గాంభీర్యమును గనవె మనసా!
వెఱ్ఱి గుఱ్ఱము నీవు నిలకడెరుగక ఉరికి – ఆయాసపడనేల మనసా?
తలచినంతనె నిన్ను తరియింపజేయగల – తలపు తగులవదేల మనసా?
మార్తాండ పుత్రుండు మాలిమెరుగని వాడు – మన్నించడే నిన్ను మనసా!
తరుణమిదె తరలుమని తరలించుకొని బోయి- చిత్ర సమ్మతి దెలుపు మనసా!
అంతమెరుగని గతుల గమనించుమని నిన్ను- ఘోరగతుల నడుపు మనసా!
వెట్టిబాధల మాపు పరమేశు నామమును- కోరిజేరుము నేడె మనసా!
కొనియాడ నేర్వవే మనసా!
మోహాన మునుగవే మనసా! నామ మోహాన మునగవే మనసా!