మూర్ఖ బాలుడ నేను – మన్ననెరుగని వాడ,
లాలించి మనుపుమో – మలయాచలేశా!
మంది నడిచిన దారి – మన్ననొసగే నంచు,
మాయ కీలల బడితి – మన్నించి మనుపు!
మాతంగ ముని కన్య కినుక గొనెనో ఏమొ,
మతి మందమొందుటే మిన్న ననెంచేను,
మగత మోహములోనె వసతి నొందేను,
మరుగు దారుల దూరి మరలమరచేను!
ఓరిమెరుగని తనువు నిలువనొల్ల ననంచు,
మాటిమాటికి కుడిచి కునుకు దీసేను,
వసతి లేదని వగచి పొర్లిగింతల బెట్టి,
కర్మ వెనుకటిదంచు కుళ్ళి కుమిలేను!
ఏదారి నడచినా – ఏ పలుకు పలికినా,
నిన్ను జేరెడి పలుకు పలుకలేనైతి,
జాడ జాడన నిండి ఆలకించెడి వాడ!
అరుదైన ఆ పలుకు నెరిగించ రాదా!
దరిజేర్చ తలచితే దారి కరువగునా?
ధరణి నేలెడి వాడ -కరుణ తరుగౌనా?
పెన్నిధగు ఆ పేరు పలికించుకొని మనుపు!
నీవు గాకింకెవరు మము మనుపగలరు?
ఔనన్న కాదన్న కన్న తండ్రివి నీవు,
సాక సాకుల నెన్న పాడిగాదు,
తప్పు కుప్పలు తుడిచి తగుదారి నడిపించు,
నాటి మాటలు మరచి నేడు వినుము!