పాలు పోసుక కంకులన్నీ వింతనాట్యము లాడుతుంటే
తొలకరప్పుడు తనువు చీల్చుక పుట్టినా పసి పరకలన్నీ
ఎంత ఎత్తుకు ఎదిగి యదపై సోయగంబులు నింపెనంచూ
మురిపెమున మురిసేను గాదా అణువు అణువున పుడమి తల్లి!
లేత కొమ్మల కొనన నిలిచిన వన్నెవన్నెల విరుల బంతులు
పిల్ల తెమ్మెర చేరగానే- పరిమళంబుల కబురు పంపి
ఉన్న తావును తుమ్మెదకుతా నింపుగా తెలిపేటి తరిగని
ముచ్చటగ మురిసేనుగాదా- వనము వనమున తరువు తల్లి!
ఆటపాటల అలసి సొలసీ – ధూళితో తనువెల్ల నిండగ
చిలిపిగా చిందేసి దుమికీ- జలక్రీడల మురిసిపోయే
ఆలమందలు, గోప బాలురు, అలసి పోయిన నగర వాసులు
నీటి మడుగున సేద దీరగ మురియదా గాంగేయు తల్లి!
పగటి వెలుగుల బాట నడచీ – ఎంతగా తానలసి యున్నా
తనువులో తూకానికై ఒక కండయైనా మిగులకున్నా
కడుపు చించుక పుట్టినా కన్న కూనను గాంచగానే
వెఱ్ఱిమోహము ముసిరి మురిపెము పొంగునేలో తల్లిలో!
జగము ఛాయని, నమ్మ వాద్దని, అందురే వేదాంతులంతా
ఛాయలో గనిపించు ఈ రుచి, అసలులో ఎంతెంత గలదో!
మచ్చుకైనా ఒక్క చినుకీ ‘తల్లిప్రేమ’ను వీచికుంటే
ఇన్ని ఉర్పులు సోకికూడా కరుగ కుండుట వింతగాదా?
అసురులను దునుమాడి నీవట విశ్రమించుట పాడిగాదు
పుడమిపై నీ పదము సోకక యుగము లాయెను మేలుకో
వేగమే నీవవతరించిక నీదు మహిమను చాటుకో
జాగుజేసిన నీదు ప్రేమను తల్లులే మరిపింతురేమో!
ఇది పోటీ యుగం మరి!