తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా! మమ్మేలు మారాజ మలయగిరి వాసా!
భద్రగిరి, శేషగిరి, అరుణగిరి యంచు – గిరి కొమ్ముపై నేల కొలువుందు వయ్యా?
గోకులంబున ఆడి గోవర్ధనుని మోసి – గోపజనులను గాచి యశము గొనువాడా!
మందరను మోయగా కూర్మరూపము నొంది-ఓరిమిన మధనమును నడిపించువాడా!
అలనాడు గిరి పాదు – ఈ నాడు గిరి కొప్పు – గిరినేల తగిలుందు వెరిగింపుమయ్యా!
||తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా! మమ్మేలు మారాజ మలయగిరి వాసా!||
రూపమెరుగని తల్లి తోడు నడువగనెంచి – గిరిరాజు నింట తా రూపమొందేను!
కొలువు గోరెడివారు కొండ కోనల జేరి – రేపగలు తగిలిరే నీదు తలపులను!
కొండంత దేవరా – కొండేల కొలువయ్య? తగులగా నీకు తగు తెరపిగనలేవా?
||తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా! మమ్మేలు మారాజ మలయగిరి వాసా!||
అడుగడుగుగా నడచి చేరలేనా చోటు – ఎంచి నిలచుట నీకెటుల చెల్లు?
కొలువ జేరుడు వారి దారి ఇడుముల ద్రుంప – తలుప నొల్లగ నేల తలుతువయ్యా?
కొండ కొలువగు వాడ – కొండంత కరుణగను – జగతి నిండిన దంత నీదు సంతు!
||తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా! మమ్మేలు మారాజ మలయగిరి వాసా!||