ఐరావతముకైన ఆది దేవునికైన – ఆనతీయగలట్టి చిన్న శిశువు!
పూతనంతటి అసురి -కుడిచి కూల్చిన వాడు-పలురక్కసుల పీచ మణచువాడు,
గోపెమ్మ ఒడిలోన ఒదిగి కొంగునదూరి- కుడుచు కుడుపున ఏమి కుడుచుచుండు?
గుమ్మపాలను త్రాగి-వెన్నముంతలు దోచి, ఆలమందల తోలు -గొల్లవాడు,
దేవకీసతి నేంచి చరసాలలో మొలిచి – వసుదేవు తో పల్లెజేరినాడు,
నందకాంతను బ్రోవ నడచిరాగల వాడు – వల్లమాలిన రాది నెన్ననేల?
ధనుర్బాణము వీడి -సిరి సేవలను వీడి- తీరైన తల్పమగు శేషు వీడి,
వెదురు బొంగును బట్టి -నెమలి పింఛము బెట్టి -లేగ సాటిగ నాడు బుడత వీడు,
వటపత్ర శాయిగా నెలవు నిలిపెడివాడు – గోపకాంతకు ఏల బాలుడాయె?
అదిలించి, బెదిరించి, అనునయంబున బిలచి, ఆదరించెడి ప్రేమ ననుభవింప,
పూర్వపుణ్యము లేమి గోపెమ్మజేసెనో – గోవిందుడా ఇంతి ఇంట జేరె!
అడుగు వెంటన అడుగు మారాముగా నడిచి- ముద్దుమురిపెము దీర్చి మోదమొసగె!
భాగ్యమేమని అందు -రేపల్లె వాసులది – రేయిపగులూ వాని తోడు నడువ!
దండనైనా గాని – పండగైనా గాని – పంతమాడగ వాని సాటనెంచి!
సావాసగాళ్ళతో చల్ది పంచుక తిన్చు- హరియించినా ఫలము ఎవరికెరుక?
చిటికెడటుల నంది సిరులు మొప్పెడివాడు-వెన్న ముద్దల కేల చేయిజాచె?
ఆదమరపుననైన తులసి వీడని పదము-గొల్ల బాలరు వెంట ఏల నడచె?
పూర్ణకాముని నెరుగ తగువాలెరయ్య? తరుగు నేనని ఏల ఎంచివగతు?
అట్టి ఆ బాలుండు- అనునయంబున నన్ను అనుదినంబును జేరి మనుపుగాక!
మన్ననెరుగని మనసు మాయ మోహము వీడి-వాని మోహమునందు మునుగుగాక!
తనువులో అణువణువు తారకంబగునట్టి నామ నాదమునంది ఆడుగాక!