వ్యాస పుత్రుని మన్ననందిన -యోగిపుంగవు యోగమేమని,
ఒప్పు భావపు భావపుంతలు – పలుక నొల్లనె బోయ కావ్యము!
సంతులేనీ జనకు నింటన – చిట్టి చేతల చేతనల తో,
నటనలాడిన ధరణి కన్నియ – పుత్రి కాయెను రాజ యోగికి!
ఆట పాటల మురిపెములతో – పిత్రు ప్రేమను తట్టి లేపగ,
కందుకము తానందుకొనగా – కదుప గలిగిన శిపుని వింటిని,
సంధింప గలిగిన సుందరుండని – అవని నేలెడు భార్గవుండని,
పుణ్య పుంతల భాగ్యమిదెయని – దశరధాత్మజు పదము కడిగెను!
వన్నెతరుగని వజ్రములతో – వన్నెకెక్కిన ముత్తెములతో,
మేలి బంగరు భూషణంబుల భారమొందిన మత్తగజములు,
బారులుగ తన బాలికకుతా సారెగా నిడి సంతసించుచు,
నీలమేఘుని జంటనుండగ మోహనాంగిని సాగనంపెను!
లేత మామిడి తోరములతొ – అరటి పూవుల స్తంభములతో,
విరుల గుత్తుల అమరికలతో – రంగవల్లుల రాచవీధుల,
ఆడి అలసిన అతివ పాదపు అందె సందడి అణగు లోపలె,
నారలూనిన రామచంద్రుని తలచి భూపతి ఏమనెంచెనో!
పట్టుపరుపుల తూగుటూయల – పరిజనంబుల సేవ క్రతువులు,
నియమముగతా నిత్యమందుచు – తలుపడే తన ముద్దు కన్నెను?
అరమరెరుగని అడవి దారుల – అలసటెరుగని రాఘవునితో,
అడుగులో అడుగేని నడిచెడి భాగ్యమేమని ఎంచునో!
పాయసాన్నపు పాత్రలో – పూజ జేసెడి పూవులో,
కొలను అలపై తళుకు లీనుచు తరలి కదిలే అలలలో,
మద్దు పలుకులు కుమ్మరించే పంజరపు ఆ చిలుకలో,
పర్ణశాలన మసలుకొను – తన పాప జాడల జూడడే!
పూర్వపున్నెపు పూజ ఫలమో- మిగులు పాపపు నీలి నీడో,
రాజయోగుల రాచబాటల తీరు ఇదియని తెలుపుటో,
మనుజ దేహపు ఉనికియగు ఈ మనసు ఏమని ఎంచెనో,
తెలియజేసెడి తేట పదములు పలుకువారెట నుంటిరో!
నిస్సంగు నిత్యము నమ్ముకుంటే- నిర్మోహి చింతన నియమమైతే,
మాయమోహము మాపుదారుల – మసలగా మనసను మతిస్తే,
ఏది మురిపెము? ఏది స్పందన? జగతి నడిపెడు నియమమో?
పాప పుణ్యపు పద్దు సర్దెడి – వెట్టి గాధల వైభవంబెది?
సకల మెరిగిన ఈశ్వరుడు- నా జనకుడని నే నెంచినా,
నాటి సుంకము చేర్చలేదని వీధి జూపెను ప్రేమతో!
తప్పుగాయని తల్లిదండ్రుల తగులడే ఏ లోకనాధుడు?
నీకులేనీ నియమ సుంకము దేహినగు నాకెందుకో?
కన్నకూనల కఠిన దినములు -కన గలుగు యోగము ఎందుకో?
మోహ నాశము కలుగజేసెడి దివ్య విధమిద – లోకపాలక?
ఎట నెరుక గొంటివి ఇట్టి పాఠము- గురువు పదమున చిచ్చుగా!
ఏమరపు విడుమిక ఏలువాడా – ఏలుకొను నా కంటి వెలుగుల!
కోరబోవను అమర ధామము- వేడ బోవను మెచ్చ మెరపులు,
తల్లితనమున తగిలి ఎరిగితి – మోహ మెంతటి మధురమో!
ఎరుగ గల తరి ఎరుకయైతే – ఎరుగు మోయది వేగమే!
అర్తలోకపు అర్తిగాదది ఏమరుపు నీదని ఎరుకనొందుము!
సాటి జీవుల వేదనలలో వ్యధను జూదని మనుజుడెందుకు?
ప్రేమ మూర్తగు పరంధాముని వారసునికది తగిన తీరా?
కన్నవారెటు తీసిపోదురు సాటిమానవ కులముతో?
కరుణ మూర్తివి – కఠిన క్రతువుల అమరజేయకు దేవరా!
నిలకడెరుగని మనసు తీరును – తప్పు పట్టుట నీకు చెల్లును,
మనసు ఒప్పని యోగమార్గపు సాధనెంచగ నాకు చెల్లదు,
నియమమిదె యని నిక్కు జేయకు – నీజాడనేని ఎరుకమానకు,
తల్లిమనసుకు తాపమొసగెడు తీరు తనయుల కొసగజేయకు!
దొడ్డమాటల మూటతొనిను ముంచి పొగడగ భాషజాలదు,
మణులు మాణిక్యముల రాసుల మొక్కగా నా తాహతొల్లదు,
పలుమారు పలికెద నీదు నామము – ఎరుక గలిగిన తీరులో,
లోపమేదో ఎంచజూడక ఆదరముగొని తనయు నాదుకో!
గోవిందా! వాసుదేవా! దామోదరా! ఆదుకో!