ధరణి వాసులు నన్ను అవని వాసంటారు,
అవని వాసులు నన్ను అధోవాసంటారు,
అధో అవనుల మధ్య ఆకాశ వీధులలో,
నడయాడి బ్రతుకు మనె నన్ను నెరిపిన వాడు!
గగన వీధులవెంట గర్వించి పయనించు,
ఆదిత్యు తాపమున తపియించు తనువుతో,
తరలి తగిలెద నేను సాగరుని యెదలో,
దయజూచి దరిజేర్చి తనువు దాహము దీర్చు,
మరలి రమ్మంచు నను మరి అంపుచుండు!
తీయనైనా చినుకు తనకు పంచమనంచు,
పవనుండు పంతమున పలుమారు తాడించ,
ఒల్లనన్నావినక వెంట వెంటన తరిమి,
కయ్యమున ననుజేరి మెరుపుదాడుల నెరప,
కావుమన్నా రాని అమర వాసుల దండు,
ఏటికో నేడెటకొ ఏగుచున్నవి వడిగ!
లోకాన ఏవింత సంతరించినదో!
ముందు కదిలెడి వాడు నీల మేఘుని ఛాయ,
వరద హస్తపు భంగి విడలేనివాడు,
రక్ష రక్షణయందు రయము నేగెడి వాడు,
తొందరొందెనొ ఏమొ తగుల లేదే రక్ష,
పాద రక్షలు లేని పదముతో పరుగిడగ,
ఉప్పొంగి తలచేను గగన బింబము లెల్ల,
ఏనాటి నాతపము ఈనాడు ఫలియించె,
అంబుజాక్షుని చరణ ఘాతమందంగా!
సురకాంత సేవలన సేద దీరెడి తల్లి,
పతి వక్షమున వెలయు కల్పవల్లి,
ఏటికో ఈనాడు పతి పదంబుల వెంట,
అడుగుయందడు గేసి పరుగునురికె!
పద ఘాతముల వడికి వీడినా కేశములు,
కారు మబ్బుల బోలి పరచుకొనగా,
ఉలికి పడి దినకరుడు భీతిగొని జూచేను,
రయమునురికెటి కేశ ఫణుల వంక!
ఆవెంట కదిలేటి వైకుంఠ వైభవము,
ఎన్న నేరక యుండె పద వైభవములు,
ప్రభుని ఆనతి నంది మనలేని తమగతిని,
చింతించి చినబోయి చితికి కదిలేరు!
పురము లెరుగగ జనిరి గగన వీధుల నిండ,
జగమెరుగగా జనిరి అనతి వేగముతో,
సుర గణంబులు తరలి చోద్యమొందంగా!
అవని వానుల మనము లచ్చరువునొంద!
ఎవరి పూజలనంద పరవశించెనొ గాని,
ధన్యనైతిని నేను నేటి సందడితో,
ఎందుకీ అంబరము ఇంత కురచను గాంచె?
వైభవంబగు వీరు వేగ జనగా?
ఆనాటి కానాడు ఆపాద ఘాతముల,
సుర సోఖ్య భాగ్యమును పొందగోరిననూ,
పన్నగాధిపు పదము కందునేమో యంచు,
నిగ్రహించితి నన్ను ఎరుగు మనెనే!
అట్టి ఆ సందడులు కరిని గాచిన వెనుక,
కనికరము గని మమ్ము కననైన గన కుండ,
గరుడ వాహనమెక్కి ఘన కీర్తు లందుచూ,
నిజవాసమేగి రిట దయలేనివారు!