జోల

కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపానూ –
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే! ..
ధరణి మడియగ భువికి తరలిన దైత్య సంతును గావగా,
దయను మీరగ వన్నె చిన్నెల వింతరూపులనాడినా,
ఆనందరూపుని కథలు పాడరే – పసి మనంబున పండగా!
కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపనూ-
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…
సాగరములుప్పొంగి సకలము లయమునొందు చునుండగా,
అనరు గావగ మత్స్యమై ఈ ధరణి గాచిన దేవునీ,
ఎరుక తెలిపెడి వింత కథలను కమ్మగా ఇక పాడరే-
కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపనూ-
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…
సురల తోడుగ అసురులంతా సాగరంబును చిలికగా,
క్రుంగు కవ్వపు కాపుగా తా కూర్మమాయెను ఎరుగరే!
కరుణ అవధులు కద్దుయని తా పర్వతంబునె మోసెనే,
ఆ కథను నేడిక పలుకరే ఈ చిన్ని పాపకు జోలగా,
వీనులకు మోదంబు గలుగగ నాటి కథలను పాడరే!
అన్నదమ్ముల శ్రమకు ఫలమని అమృతంబే పొంగినా,
అమిత అహముకు తగదనంచు మోహినై మురిపించెనే!
నాటి మురిపెపు మూట పాటను మేటిగా ఇక పాడరే!
కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపనూ-
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…

శృక్కు శృవ వాక్సీమ గల్గిన ఆదిరూపమునెరుగరే-
జగతి నడిపెడి నియతి జాడలు – వెదకి పదిలము జేసెనే,
మూగబోయిన ధాత వాణికి జీవధారల గూర్చెనే-
ఆ కథను నేడిక పలుకరే ఈ చిన్ని పాపకు జోలగా,
వీనులకు మోదంబు గలుగగ నాటి కథలను పాడరే!
తనువు రూపముగట్టు తరినే మంత్రమందిన డింగరి,
పిలుపునందుక కంబవాసము వీడి రక్కసు దృంచెనే,
మృగము సగమై మమత పంచిన మోహనాంగుని లీలలూ
కథలు కథలుగ పాడరే ఈ చిన్నిపాపకు జోలగా!
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…
బుడత వటువై ధరణి గొలిచిన వామనును కథ తెలుపరే,
సురల గావగ అసురశేఖరు యాగశాలన నడచెనే,
సిరిని బట్టిన వరదహస్తము దానమందగ వంగెనే!
వాసుదేవుని వింతలీలలు కథలు కథలుగ పాడరే!
కనులు మూయని పాప మనసున కథల పాటలు నింపరే!
ధరణి భారము దీర్చగా ధరణీశుడై ధర మొలిచెనే,
ధరణిసుత చేయందగా తా హరుని వింటిని విరిచెనే,
భార్గవుని తేజంబుగైకొని శ్రీరాముడై ధర నడిచెనే !
మోహమున మునివరుల ముంచిన రూపశోభల పాడరే!
మోహమొందిన పాప కన్నులు నిదుర మోహము నొందగా!

Leave a comment