ముచ్చటైనది బొమ్మ – ముద్దుగారే బొమ్మ – మాడలెన్నొ బెట్టి నేనుకొన్నీబొమ్మ,
కనులు త్రిప్పుచు నన్ను పలుమారు జూసేను – పలకరింపుల నగవు లొలకబోసేను,
తోడు ఆడును నాతొ – అలుపు సొలుపూ లేక – అందాల నాబొమ్మ అరుదైన బొమ్మ!
తోటివారలు దాని తాకనేనొల్లనే – తలపునైనను నేను దాని వేరుంచనే,
మనసెరింగిన హితులు మన్నించి చెప్పినా – మన్నించనే నేను మాటలేవి,
విడువనే క్షణమైన విలువైనదది యంచు – మోహమొందెద నెంతొ మోదమొంద!
పంచి ఆడుదమంచు జెరి కోరెడివార – జోడు వీడెద గాని పంచుకోను,
సొగసు జూచెద మేది ఒకమారు ఇమ్మన్న – దాచి యుంచెద గాని చూపబోను,
బొమ్మయే అది యంచు పలుకు వారలనేను – పొసగలేనేలనో పలుకలేను!
పున్నములు కృంగాయి – పసిపక్షు లెగిరాయి – జరనన్ను జేరగా జరిగివచ్చె,
పంచుకుంటే పెరుగు – ఉంచుకుంటే తరుగు – తెలివి ఎరుగగ లేదె నాడు నేను,
పలుమారు తెలిపినా పంతాన నిలిచాను – పరువంపు పొంగులో పొరలకున్నాను!
బొమ్మగోరెడివారు – ఒకరైన కనరారు – పిలిచి పంచినగూడ – పొందబోరు,
బొమ్మనగవులు నన్ను మురిపింప మరచాయి -చిన్నబోతిని నేడు చేరదీయ,
కోరి కొసరిన నాడు కాదన్న ఫలమిదా? కొరివాయె నాతలపు కొరతనాకు!