వందనం

దావఖానట నీది – దండమే మందంట

తొలగ జేయునట తనువు ఇడుములెల్లా!

కైమోడ్చెదను నీకు – కూరిమొసగుము నాకు,

కఠిన క్రతువుల నడత నడువు మనకా!

అరకు మందుల అలసి-అడవి దారుల తిరిగి,

అలసి సోలితి నేను ఆదరింపూ,

ఆటయని దలచితే వేటాయె ఈ బ్రతుకు,

ఆదుకుని వేగమే అలుపు దీర్చు!

వెదురు బొంగున రాగ మమరించు వాడు,

వేదములె వదనముగ వెలుగొందువాడు,

వంక లేనొక వంక జఠను గల్గిన వాడు,

వేడి నిను బంపిరట వంకరలు దీర్పా!

నిలకడెరుగని మనసు నెమ్మదొందే మందు,

మనసు మూలల నిలచు మదమణచు మందు,

భీతొంది భవరోగ మంతమగు మందు,

పలుకగా పరమిచ్చు పస గలుగు మందు!

సంతర్పణగ నాడు పంచిచ్చి నావంట,

పలు వంకరల బలుపు అణగించి నావంట,

పలికి నంతనె బదులు పలుకుతానని నాడు,

ఆన నెరిగించితి వట ఆదరము మీరా!

అలనాటి ఆ మాట నేటికీ నడచునని,

నమ్మబలికిరి నిన్ను నమ్మున్న వారు,

ఆదుకొను వాడవని వందనము లిచ్చీ,

పలుమారు పలికినా బదులాడవేమీ?

పొరలు పొంగుల కృంగు పసి చేష్టలంచూ,

పొంది కెరుగని పిన్న ప్రవరలివి అంచూ,

మిన్నకుండకు మయ్య బహు పెద్ద ఒజ్జా!

నా సుతుల రక్షించు నన్ను మన్నించు!

Leave a comment